Asianet News Telugu

ఇంగ్లాండ్ వర్సెస్ విండీస్ రెండవ టెస్టు: కరేబియన్లను ఆపతరమా..?

సిరీస్‌ రేసులో నిలిచేందుకు ఇంగ్లాండ్‌ ఆరాటపడుతోంది. పటర్నల్ సెలవు ముగించుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ జో రూట్‌ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ తలరాత మారుస్తాడనే అంచనాలు ఇంగ్లీష్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో నెలకొన్నాయి. వర్షం ముప్పు పొంచి ఉన్న మాంచెస్టర్‌ టెస్టును సొంతం చేసుకునేందుకు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు తయారుగా ఉన్నాయి. నేటి మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభమవనుంది. 

England vs West Indies 2nd Test Match preview: With Joe Root's Return, What's At Manchester
Author
Manchester, First Published Jul 16, 2020, 11:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజ్డెన్‌ సిరీస్‌ వేటలో వెస్టిండీస్‌ ఉత్సాహంగా కనిపిస్తోంది. సౌతాంప్టన్‌లో సాధికారిక విజయం అందుకున్న కరీబియన్‌ జట్టు.. మాంచెస్టర్‌లోనే సిరీస్‌ను లాంఛనం చేసుకోవాలని భావిస్తోంది. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 

మరోవైపు విజ్డెన్‌ సిరీస్‌ రేసులో నిలిచేందుకు ఇంగ్లాండ్‌ ఆరాటపడుతోంది. పటర్నల్ సెలవు ముగించుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ జో రూట్‌ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ తలరాత మారుస్తాడనే అంచనాలు ఇంగ్లీష్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో నెలకొన్నాయి. వర్షం ముప్పు పొంచి ఉన్న మాంచెస్టర్‌ టెస్టును సొంతం చేసుకునేందుకు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు తయారుగా ఉన్నాయి. నేటి మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభమవనుంది. 

విండీస్ ను నిలురానించతరమా..?

స్వేచ్ఛగా క్రికెట్‌ను ఆడటంలో కరీబియన్‌ క్రికెటర్లు శైలే విభిన్నం. యువ ప్రతిభావంతులతో కూడిన వెస్టిండీస్‌ జట్టులో మ్యాచ్‌ విన్నర్లు రూపుదిద్దుకుంటున్నారు. కాంప్‌బెల్‌, బ్రాత్‌వేట్‌, హౌప్‌, బ్రూక్స్‌ సహా ఛేజ్‌, బ్లాక్‌వుడ్‌, హౌల్డర్‌, డావ్రిచ్‌లు విండీస్‌కు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ అందిస్తున్నారు. 

ఆఖరు వరుస బ్యాట్స్‌మన్‌ సైతం విలువైన భాగస్వామ్యాలు నిర్మించగల సమర్థత కలిగినవారే. బంతితోనూ విండీస్‌ను సూపర్‌గా కనిపిస్తోంది. ప్రపంచ ఉత్తమ పేస్‌ దళాల్లో ఒకటిగా విండీస్‌ ఉంది. 

కెప్టెన్‌ జేసన్‌ హౌల్డర్‌, కీమర్‌ రోచ్‌, గాబ్రియల్‌లు ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ను కకావికలం చేయగలరు. పక్కా ప్రణాళికతో బౌలింగ్‌ చేస్తున్న విండీస్‌ మాంచెస్టర్‌కు సైతం భిన్నమైన వ్యూహంతోనే రానుంది. బాహుబళి క్రికెటర్‌ రహీమ్‌ కార్న్‌వాల్‌ స్పిన్నర్‌గా తుది జట్టులో ఉండనున్నాడు. కార్న్‌వాల్‌ మాయజాలంతో పాటు బ్యాట్‌తో విశ్వరూపం చూపించగల ఉద్దండుడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న వెస్టిండీస్‌ను నిలువరించటం ఇంగ్లాండ్‌కు అంత సులువు కాదు.

రూటు మారేనా..?

సెలవుతో తొలి టెస్టుకు దూరమైన జో రూట్‌.. రెట్టించిన ఉత్సాహంతో మాంచెస్టర్‌కు చేరుకున్నాడు. పుత్రోత్సాహంలో ఉన్న రూట్‌ ఇక్కడ భారీ ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తాడనే అంచనాలు ఇంగ్లాండ్‌ శిబిరంలో ఉన్నాయి. 

వైస్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కెరీర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. బంతితో, బ్యాట్‌తో విండీస్‌ను ఇరకాటంలో పడేయగల స్టోక్స్‌ ఇంగ్లాండ్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌. జో రూట్‌ రాకతో బ్యాటింగ్‌ లైనప్‌ బలోపేతం కానుంది. 

రోరి బర్న్స్‌, సిబ్లే, పోప్‌, బట్లర్‌, స్టోక్స్‌లతో కలిసి రూట్‌ బ్యాటింగ్‌ బాధ్యత తీసుకోనున్నాడు. రూట్‌ రాకతో జో బెన్‌ తుది జట్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టుకు దూరమైన స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ సైతం తిరిగి రానున్నాడు. 

మాంచెస్టర్‌ చివరి టెస్టులో బ్రాడ్‌ కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు. ఆర్చర్‌, అండర్సన్‌లతో కలిసి బ్రాడ్‌ కసిగా వికెట్ల వేటకు సిద్ధపడుతున్నాడు. స్పిన్నర్‌ డామ్‌ బెస్‌ మాంచెస్టర్‌లోనైనా మెరుగైన మ్యాజిక్‌ చేయాలని ఎదురుచూస్తున్నాడు. మాంచెస్టర్‌లో ఓడితే సిరీస్‌ విండీస్‌ పరం కానుంది. దీంతో ఈ టెస్టును ఇంగ్లాండ్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్... 

మాంచెస్టర్‌ ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ పిచ్‌ సౌతాంప్టన్‌ కంటే వేగంగా ఉండనుంది. పేస్‌, బౌన్స్‌ ఎక్కువగా లభించనున్నాయి. పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక బాగుంది. మ్యాచ్‌ ఉదయం నాటికి క్యూరేటర్‌ పచ్చికను తగ్గిస్తారా, అలాగే ఉంచుతారా అనేది ఆసక్తికరం. మాంచెస్టర్‌ టెస్టు తొలి మూడు రోజులు వరుణుడు అంతరాయం కలిగించే ప్రమాదం కనిపిస్తోంది. మేఘావృతమైన వాతావరణంలో పేసర్లను ఎదుర్కొవటం అంత సులువు కాదు!. టెస్టు మ్యాచ్‌ మూడో రోజు భారీ వర్ష సూచనలు ఉన్నాయి.

ప్లేయింగ్ (ఎలెవన్ అంచనా)

ఇంగ్లాండ్‌ : రోరి బర్న్స్‌, డామ్‌ సిబ్లే, జాక్‌ క్రావ్లీ, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, ఒలీ పోప్‌, జోశ్‌ బట్లర్‌, డామ్‌ బెస్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌.

వెస్టిండీస్‌ : జాన్‌ కాంప్‌బెల్‌, క్రెయిగ్‌ బ్రాత్‌వేట్‌, షై హౌప్‌, షమ్రా బ్రూక్స్‌, రోస్టన్‌ ఛేజ్‌, జె బ్లాక్‌వుడ్‌, జేసన్‌ హౌల్డర్‌, షేన్‌ డావ్రిచ్‌, రహీమ్‌ కార్న్‌వాల్‌, కీమర్‌ రోచ్‌, షానన్‌ గాబ్రియల్‌.

Follow Us:
Download App:
  • android
  • ios