టెస్టు ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన బెన్ స్టోక్స్... న్యూజిలాండ్ ముందు 394 పరుగుల భారీ టార్గెట్... కేన్ విలియంసన్ డకౌట్.. 

టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ఆటతీరును మొత్తం మార్చేశాడు బెన్ స్టోక్స్. అంతకుముందు 12 మ్యాచులు ఆడి రెండే రెండు విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. బజ్ బాల్ కాన్సెప్ట్‌ని పరిచయం చేసిన టెస్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ దూకుడు, ఇంగ్లాండ్ ఆటతీరులో స్పష్టంగా కనిపిస్తోంది...

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్, విజయం దిశగా సాగుతోంది. తొలి రోజు రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, ఆతిథ్య జట్టుకి షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్. 58.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది..

జాక్ క్రావ్లే 4, డంక్లెట్ 84, ఓల్లీ పోప్ 42, జో రూట్ 14, హారీ బ్రూక్ 89, బెన్ స్టోక్స్ 19, బెన్ ఫోక్స్ 38, ఓల్లీ రాబిన్‌సన్ 15 పరుగులు చేశారు. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 306 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

టామ్ లాథమ్ 1, డివాన్ కాన్వే 77, కేన్ విలియంసన్ 6, హెన్రీ నికోలస్ 4, నీల్ వాగ్నర్ 27 పరుగులు చేయగా టామ్ బండ్లెల్ 138 పరుగులు చేసి న్యూజిలాండ్‌ని ఆదుకున్నాడు. రెండో రోజే రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ఇంగ్లాండ్, 374 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

జాక్ క్రావ్లే 28, డంక్లెట్ 25 పరుగులు చేయగా ఓల్లీ పోప్ 49, స్టువర్ట్ బ్రాడ్ 7, జో రూట్ 57, హారీ బ్రూక్ 54, క్రిస్ ఫోక్స్ 51, బెన్ స్టోక్స్ 31, ఓల్లీ రాబిన్‌షన్ 39 పరుగులు చేశారు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

టెస్టుల్లో 109 సిక్సర్లు బాదిన బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ రికార్డును అధిగమించాడు. తన రికార్డును బ్రేక్ చేసిన బెన్ స్టోక్స్‌ని, ఇంగ్లాండ్ ప్రస్తుత హెడ్ కోచ్ బెన్ స్టోక్స్ చప్పట్లతో అభినందించాడు..

తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి న్యూజిలాండ్ ముందు 394 పరుగుల భారీ టార్గెట్‌ని పెట్టింది ఇంగ్లాండ్. ఈ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌కి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న డివాన్ కాన్వే 2 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ 5 బంతులు ఆడి బ్రాడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు.. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్ విధించిన లక్ష్యానికి 380 పరుగుల దూరంలో ఉంది...

15 పరుగులు చేసిన టామ్ లాథమ్ కూడా స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా, ఆ మూడు కూడా స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయినవే కావడం మరో విశేషం..