Asianet News TeluguAsianet News Telugu

ENG vs NZ: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్లకు భారీ షాక్.. కివీస్ ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్..

England vs New Zealand: ఏడాదిలో ఎంత మార్పు..! గతేడాది ఇదే సమయానికి  ఇంగ్లాండ్ ను వారి స్వంత గడ్డమీదే ఓడించి సిరీస్ ఎగురేసుకుపోయిన కివీస్ పై ఇంగ్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. కేన్ మామ సేనకు ఘోర అవమానాన్ని మిగిల్చింది.

England Thrash New Zealand by 7 Wickets, clean Sweeps The Test series With 3-0
Author
India, First Published Jun 27, 2022, 8:01 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 లో భాగంగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ను  ఆథిత్య  ఇంగ్లాండ్ 3-0తో గెలుచుకుంది. లీడ్స్ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లాండ్.. విజయానికి కావాల్సిన 113 పరుగులను సాధించి కివీస్ ను ఉత్తచేతులతో ఇంటికి పంపించింది. గతేడాది జూన్ లోనే  ఇంగ్లాండ్ ను స్వదేశంలో 1-0తో ఓడించిన కివీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్ హోదాను అనుభవిస్తున్న కివీస్ కు ఇది భారీ షాక్ కిందే లెక్క. 

296 పరుగుల లక్ష్యంలో భాగంగా.. నాలుగో రోజు 39 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిన  ఆథిత్య జట్టు.. ఐదో రోజు మరో 15 ఓవర్లలోపే ఆటను ముగించింది. 54.2 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. చివరి రోజు చేయాల్సిన 113 పరుగులను బెయిర్ స్టో (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) ఊదిపారేశాడు.  నిన్నటి ఆటను కొనసాగిస్తూ రూట్ (86 నాటౌట్.. 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగాడు. 

ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 329 పరుగులకు ఆలౌట్ అయింది. దానికి బదులుగా ఇంగ్లాండ్.. 360 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్.. 326 పరుగులే చేసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 296 పరుగుల లక్ష్యాన్ని నిలపింది.  ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 54.2 ఓవర్లలోనే సాధించింది.  ఈ టెస్టులో ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, జో రూట్, డారిల్ మిచెల్ ఇద్దరికీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. 

 

తాజాగా సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో న్యూజిలాండ్ మరింత దిగజారింది. దీంతో ఈ సీజన్ లో ఆడిన 9 టెస్టులలో కివీస్.. ఆరింటిలో ఓడి రెండు టెస్టులు మాత్రమే గెలిచి 28 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నది. 

ఈ జాబితాలో కొద్దిరోజుల వరకు అట్టడుగు స్థానాన నిలిచిన  ఇంగ్లాండ్.. తాజాగా సిరీస్ విజయంతో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకున్నది. ఈ సీజన్ లో ఇంగ్లాండ్ కు ఇది నాలుగో విజయం. 15 టెస్టులాడిన ఆ జట్టు.. నాలుగు విజయాలు, 7 పరాజయాలతో కలిపి 52 పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో ఆసీస్, సౌతాఫ్రికా, ఇండియా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

 

ఇక ఈ సిరీస్ కు ముందే ఇంగ్లాండ్ జట్టు బెన్ స్టోక్స్ ను టెస్టు సారథిగా  బ్రెండన్ మెక్ కల్లమ్ ను ఈ ఫార్మాట్ కు హెడ్ కోచ్ గా నియమించగా వారి తొలి పరీక్షలోనే సక్సెస్ అయ్యారు. ఇక ఇంగ్లాండ్.. జులై 1 నుంచి భారత్ తో తలపడనుంది. ఎడ్జబాస్టన్ వేదికగా గతేడాది మిగిలిపోయిన టెస్టును ఆడేందుకు  ఇంగ్లాండ్ సిద్ధమవుతున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios