టెస్టు సిరీస్కు ముందే పాకిస్తానీల మనసు దోచుకున్న ఇంగ్లాండ్ సారథి.. మ్యాచ్ ఫీజు మొత్తం వాళ్లకే..
PAK vs ENG: 17 ఏండ్ల తర్వత పాకిస్తాన్ గడ్డమీద టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్.. ఇప్పటికే ఆ దేశంలో అడుగుపెట్టింది. డిసెంబర్ 1 నుంచి మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ మొదలుకావాల్సి ఉంది. అయితే సిరీస్ ప్రారంభానికే ముందే ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్..

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ లో తలపడిన ఇంగ్లాండ్ - పాకిస్తాన్ లు మరో రెండ్రోజుల్లో టెస్టు సిరీస్ ఆడనున్నాయి. డిసెంబర్ 1 నుంచి రావల్పిండి వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ చేరుకున్న ఇంగ్లాండ్.. ప్రాక్టీస్ సెషన్స్ కూడా నిర్వహిస్తున్నది. ఇదిలాఉండగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ మంచి మనుసు చాటుకున్నాడు. ఈ మూడు మ్యాచ్ ల ద్వారా వచ్చే తన మ్యాచ్ ఫీజును మొత్తం పాకిస్తాన్ లో ఈ ఏడాది వరద బాధితులకే అందజేస్తున్నట్టు ప్రకటించాడు.
టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు బెన్ స్టోక్స్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘పాకిస్తాన్ లో చరిత్రాత్మక సిరీస్ లో తలపడేందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. 17 ఏడేండ్ల తర్వాత ఇక్కడ టెస్టు సిరీస్ ఆడేందుకు ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది..
మాకు మద్దతిచ్చేందుకు, ప్రేమ చూపేందుకు చాలా మంది అభిమానులు స్టేడియాలకు రాబోతున్నారు. ఇది చాలా ప్రత్యేకం. ఈ ఏడాది పాకిస్తాన్ లో వరదల కారణంగా చాలా ప్రదేశాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల వల్ల చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆట నాకు చాలా ఇచ్చింది. నేను ఇక తిరిగి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్ లో నేను ఆడబోయే మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో వచ్చే మ్యాచ్ ఫీజును పాకిస్తాన్ లో వరద బాధితులకు అందజేస్తున్నా.. నేను చేస్తున్న ఈ చిన్న సాయం పాకిస్తాన్ లో వరద వల్ల తమ ఆశ్రయాలు కోల్పోయిన వారికి ఎంతో కొంత సాయం చేసినా చాలు..’ అని ఒక నోట్ లో రాసుకొచ్చాడు.
పాకిస్తాన్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ :
- డిసెంబర్ 1 నుంచి 05 వరకు : రావల్పిండిలో తొలి టెస్టు
- 09 నుంచి 13 వరకు : ముల్తాన్ లో రెండో టెస్టు
- 17 నుంచి 21 వరకు : కరాచీలో మూడో టెస్టు
మార్క్ వుడ్ అవుట్..
పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే భారీ షాక్ తాకింది. ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ రావల్పిండి టెస్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా అతడు ఇటీవల టీ20 ప్రపంచకప్ లో సెమీస్ లో భారత్ తో మ్యాచ్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా రావల్పిండి టెస్టుకు కూడా దూరం కావాల్సి వచ్చింది. ముల్తాన్, కరాచీ మ్యాచ్ లకు మాత్రం ఆడతాడని హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ తెలిపాడు.