Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ పరాజయం పరిపూర్ణం.. క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్.. బాబర్ సేనకు ఘోర అవమానం

PAKvsENG:  167 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 28.1 ఓవర్లలోనే అందుకుంది.  ఫలితంగా  పాకిస్తాన్ 0-3తో ఘోర ఓటమి పాలైంది.  పాక్ క్రికెట్ చరిత్రలో సిరీస్ వైట్ వాష్ అవడం ఇదే ప్రథమం. 
 

England Beat Pakistan in Karachi Test, visitors completed the 3-0 whitewash
Author
First Published Dec 20, 2022, 12:50 PM IST

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడతామని బీరాలు పోయిన పాకిస్తాన్ కు ఘోర పరాభవం.  డబ్ల్యూటీసీ ఫైనల్ కాదు కదా మా మీద ఒక్క మ్యాచ్ అయినా గెలిచి చూపెట్టండంటూ  పాకిస్తాన్ ను ఇంగ్లాండ్ మూడు  టెస్టులలోనూ ఆటాడుకుంది. తొలి రెండు టెస్టులలో విజయానికి దగ్గరగా వచ్చిన పాకిస్తాన్ మూడో టెస్టులో మాత్రం తేలిపోయింది.  కరాచీ వేదికగా ముగిసిన మూడో టెస్టులో   పాక్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. 28.1 ఓవర్లలోనే అందుకుంది.  ఫలితంగా  పాకిస్తాన్ 0-3తో ఘోర ఓటమి పాలైంది. 17 ఏండ్ల తర్వాత పాక్ గడ్డమీద అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం గమనార్హం. 

ఈ టెస్టులో మూడో రోజు విజయానికి బాటలు వేసుకున్న ఇంగ్లాండ్.. 17 ఓవర్లలో 112 పరుగులు చేసింది. నాలుగో రోజు విజయానికి 55 పరుగులు అవసరం కాగా  పది ఓవర్లలోనే  వాటిని బాదేసింది.   ఇంగ్లాండ్ ఓపెనర్  బెన్ డకెట్.. నిన్నటి జోరును కొనసాగించాడు. డకెట్ 78 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  డకెట్ కు తోడుగా కెప్టెన్ బెన్ స్టోక్స్..  43 బంతుల్లో  3 ఫోర్ల సాయంతో 35 రన్స్ చేశాడు.  

167 పరుగుల లక్ష్య  ఛేదనలో ఇంగ్లాండ్ దూకుడునే నమ్ముకుంది.  ఓపెనర్ జాక్ క్రాలే, బెన్ డకెట్ లు ఆడుతున్నది టెస్టులా లేక టీ20లా అన్నట్టుగా ఆడారు.  క్రాలే.. 41 బంతుల్లో  7 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేయగా  బెన్ డకెట్  కూడా ధాటిగా ఆడాడు. 

ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 11.3 ఓవర్లలోనే  87 పరుగులు జోడించారు.  అబ్రర్ అహ్మద్ ఇంగ్లాండ్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు.  11.3 ఓవర్లో  జాక్ క్రాలేను ఔట్ చేసిన అబ్రర్.. తర్వాత  నైట్ వాచ్ మెన్ గా వచ్చిన రెహాన్ అహ్మద్ ను కూడా పెవిలియన్ కు పంపాడు.  అయితే  బెన్ డకెట్ తో కలిసి బెన్ స్టోక్స్ (10 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. నాలుగో రోజు ఉదయం తొలి సెషన్ లోనే పది ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించి   మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-0తో గెలుచుకున్నది ఇంగ్లాండ్. 

ఇక ఈ టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 304 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ 354 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్..  216 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.  

 

ఈ ఓటమితో పాక్.. స్వదేశంలో తొలి వైట్ వాష్ ను ఎదుర్కుంది.  పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అదీ స్వంత గడ్డపై  వరుసగా మూడు టెస్టులూ ఓడటం ఇదే ప్రథమం. కాగా ఈ సిరీస్ ఆసాంతం రాణించిన  ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios