Asianet News TeluguAsianet News Telugu

Ashes: బూడిద సమరానికి కంగారూలతో కొట్లాడే ఇంగ్లాండ్ జట్టు ఇదే..

Ashes Test Series: ఆస్ట్రేలియాపై  గతేడాది తమకు ఎదురైన దారుణ పరాభవానికి  బదులు తీర్చుకునేందుకు ఇంగ్లాండ్ సిద్ధమవుతున్నది.  ఈ నెల నుంచే   ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య  యాషెస్ సిరీస్ మొదలుకానుంది. 

England Announce Squad For First Two Ashes Tests MSV
Author
First Published Jun 4, 2023, 10:33 AM IST

ప్రపంచ క్రికెట్ లో రెండు అగ్రశ్రేణి క్రికెట్ జట్లు  స్టేడియాల్లో నువ్వా నేనా అని కొదమసింహాల్లా కొట్లాడే  తరుణం ఆసన్నమైంది. బూడిద (యాషెస్) కోసం  జరిగే ఈ పోరు ఈసారి ఇంగ్లాండ్ లో జరుగనుంది.  భారత్‌తో ది ఓవల్ లో  జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత  ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌తో ఐదు  మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్.. తొలి రెండు  టెస్టులకు జట్టును ప్రకటించింది.  

ఐర్లాండ్‌తో   ప్రకటించిన జట్టునే  యాషెస్‌ సిరీస్ తొలి  రెండు టెస్టులలో కొనసాగించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).  బెన్ స్టోక్స్ సారథ్యం వహించే  ఈ టీమ్‌లో  ఐర్లాండ్‌తో  మ్యాచ్ కు దూరంగా ఉన్న   వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్  తిరిగి జట్టుతో చేరాడు. అండర్సన్ తో పాటు మార్క్ వుడ్  కూడా టీమ్ తో కలిశాడు. 

ఐర్లాండ్ తో మ్యాచ్ లో అరంగేట్రం చేసిన జోష్ టంగ్‌ను  ఇంగ్లాండ్.. యాషెస్ లో కూడా కొనసాగించింది.  కాలి గాయంతో  9 నెలల పాటు  క్రికెట్ దూరమై ఐర్లాండ్ టెస్టుతో  రీ ఎంట్రీ ఇచ్చిన జానీ బెయిర్ స్టో.. వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. పేసర్లుగా అండర్సన్, బ్రాడ్,  ఓలి రాబిన్సన్, జోష్ టంగ్, మార్క్ వుడ్,   క్రిస్ వోక్స్ లతో  ఆ జట్టు బౌలింగ్ యూనిట్ దుర్బేధ్యంగా ఉంది.   ఇక  జాక్ క్రాలే, బెన్ డకెట్,  ఓలీ  పోప్, జో  రూట్, బెన్ స్టోక్స్,  జానీ బెయిర్ స్టో, హ్యారీ బ్రూక్ లతో బ్యాటింగ్ యూనిట్ కూడా బలంగానే ఉంది.    ఆస్ట్రేలియా కూడా  స్ట్రాంగ్ టీమ్ తోనే బరిలోకి దిగనుండటంతో ఈసారి యాషెస్  మరింత రసవత్తరంగా ఉండనుంది. 

గతేడాది  (2021-22) ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్ ను  ఆస్ట్రేలియా 4-0 తో గెలుచుకుంది. ఈ సిరీస్ తర్వాత  రూట్.. విండీస్ లో కూడా టెస్టు సిరీస్ ఓడిపోయి  కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత  ఇంగ్లాండ్  టెస్టు సారథ్య బాధ్యతలు తీసుకున్న బెన్ స్టోక్స్..  ఆ జట్టు రాత మార్చాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్  తో కలిసి అద్భుతాలు చేస్తున్నాడు. గతేడాది జూన్ నుంచి  ఈ ఇద్దరి కలయికలో ఇంగ్లాండ్ 13 టెస్టులు ఆడితే ఏకంగా  11 గెలిచింది.  అయితే  ఈ ద్వయానికి అసలైన సవాల్  యాషెస్‌తో మొదలుకానుంది. 

యాషెస్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్ స్టో, జో రూట్, జేమ్స్ అండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ లీచ్, బెన్ డకెట్, జాక్ క్రాలే, మాథ్యూ పాట్స్, ఓలీ రాబిన్సన్,  డాన్ లారెన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, జోష్ టంగ్ 

యాషెస్ సిరీస్ షెడ్యూల్ : 

మొదటి టెస్టు : జూన్ 16 - 20 - ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్) 
రెండో టెస్టు : జూన్ 28 -  జులై 2 - లార్డ్స్ (లండన్) 
మూడో టెస్టు : జులై 6 - 10  - హెడింగ్లీ (లీడ్స్) 
నాలుగో టెస్టు : జులై 19 - 23 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) 
ఐదో టెస్టు : జులై 27 - 31  - కియా ఓవల్ (లండన్) 
 

Follow Us:
Download App:
  • android
  • ios