Asianet News TeluguAsianet News Telugu

ఇటు విరాట్, అటు డేవిడ్ వార్నర్... 1040 రోజుల తర్వాత సెంచరీ బాదిన డేవిడ్ భాయ్...

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో సెంచరీలు బాదిన డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్... 1040 రోజుల సుదీర్ఘ విరామాన్ని బ్రేక్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్.. 

ENG vs AUS: David Warner scored an international hundred after 1040 days
Author
First Published Nov 22, 2022, 1:35 PM IST

విరాట్ కోహ్లీ... ఆసియా కప్ టోర్నీకి ముందు ఫామ్ కోల్పోయి అనేక విమర్శలు ఎదుర్కొన్న బ్యాటర్. మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్ 2022 టోర్నీలో ఆ సుదీర్ఘ బ్రేక్‌కి స్వస్తి పలికాడు. ఇటు విరాట్ కోహ్లీతో పాటు అటు ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కూడా ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నాడు....

అప్పుడెప్పుడో 2020 జనవరిలో టీమిండియాపై చివరి అంతర్జాతీయ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్... రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కుని అందుకోలేపోయాడు. సెంచరీ మార్కు అందుకోలేకపోయినా పరుగులు రాబడుతుండడంతో పెద్దగా విమర్శలు రాలేదు...

ఎట్టకేలకు సుదీర్ఘ బ్రేక్‌కి స్వస్తి పలుకుతూ... ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ చేశాడు డేవిడ్ వార్నర్... విరాట్ కోహ్లీ 1020 రోజుల గ్యాప్ తీసుకుని అంతర్జాతీయ సెంచరీ చేస్తే, డేవిడ్ వార్నర్ 1040 రోజుల తర్వాత శతకాన్ని నమోదు చేయడం విశేషం.  

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్, బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 48 ఓవర్లకు కుదించారు అంపైర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది..


ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ కలిసి తొలి వికెట్‌కి 269 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, 44వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు బాదిన రెండో బ్యాటర్‌గా జో రూట్‌ రికార్డును సమం చేశాడు డేవిడ్ వార్నర్...

సెంచరీ తర్వాత డేవిడ్ వార్నర్, ఓల్లీ స్టోనీ బౌలింగ్‌లో అవుట్ కాగా 130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 152 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ కూడా అదే ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. మార్కస్ స్టోయినిస్ 15 బంతుల్లో 12 పరుగులు చేసి నిరాశపరచగా స్టీవ్ స్మిత్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

మిచెల్ మార్ష్ 16 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయగా అలెక్స్ క్యారీ 12, లబుషేన్ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓల్లీ స్టోన్ 10 ఓవర్లలో 85 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, మొదటి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడి ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. దీంతో వైట్ వాష్ కాకుండా పరువు నిలబడాలంటే చివరి మూడో టీ20లో గెలిచి తీరాల్సిందే.. 

Follow Us:
Download App:
  • android
  • ios