Asianet News TeluguAsianet News Telugu

IPL Auction: ఐపీఎల్ వేలానికి మేం రెడీ అంటున్న మహ్మద్ కైఫ్.. ఫ్రాంచైజీలకు బై వన్ గెట్ వన్ ఆఫర్

Legends League Cricket 2022: భారత  మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ లు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.  వేలానికి తామిద్దరం కూడా సిద్ధంగా ఉన్నామని  ప్రకటించారు.
 

Ek pe Ek Free: Mohammad Kaif jokes about being available for IPL 2022 auction
Author
Hyderabad, First Published Jan 21, 2022, 3:37 PM IST

వచ్చే నెలలో బెంగళూరు వేదికగా జరుగనున్న ఇండయన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  వేలానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నది. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రెండు  ఫ్రాంచైజీలతో పాటు పాత ఫ్రాంచైజీలు కూడా  మెగా వేలం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వీరేగాక క్రికెట్ అభిమానులు కూడా.. ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆడుతాడు..?  ఎవరికి ఎంత అమౌంట్ దక్కుతుంది..? అని లెక్కలేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత  మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ లు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.  వేలానికి తామిద్దరం కూడా సిద్ధంగా ఉన్నామని  ప్రకటించారు. 

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన  మహ్మద్ కైఫ్.. ‘ఐపీఎల్ టీమ్స్.. వేలానికి మేం కూడా  సిద్ధంగా ఉన్నాం.  ఒకర్ని తీసుకుంటే మరొకరు ఫ్రీ...’ అంటూ  యూసుఫ్ పఠాన్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ పైన పేర్కొన్న ఫన్నీ క్యాప్షన్ పెట్టాడు. 

 

లెజెండ్స్ లీగ్ క్రికెట్ సందర్భంగా  కైఫ్, పఠాన్  కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. దుబాయ్ వేదికా జరుగుతున్న ఈ క్రేజీ లీగ్ లో ఇండియన్ మహారాజాస్ తరఫున ఈ ఇద్దరూ ఆడుతున్నారు. గురువారం రాత్రి ఆసియా లయన్స్ తో జరిగిన మ్యాచులో కైఫ్ సారథ్యంలోని  ఇండియన్ మహారాజాస్ జట్టు.. ఆసియా సింహాలను చిత్తుగా ఓడించి లీగ్ లో బోణి కొట్టింది. 

ముందుగా బ్యాటింగ్ చేసిన  ఆసియా లయన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.  పాకిస్థాన్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ కెప్టెన్ గా ఉన్న ఆసియా లయన్స్.. ఉపుల్ తరంగ (66), మిస్బా (44) రాణించడంతో భారీ  స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇండియన్ మహారాజాస్ 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్ బిన్నీ (10), నమన్ ఓజా (20), ఎస్. బద్రీనాథ్ (0) లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఈ  క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన యూసుఫ్ పఠాన్ (40 బంతుల్లో 80), మహ్మద్ కైఫ్ (42 నాటౌట్) తో కలిసి నాలుగో వికెట్ కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఫలితంగా 19.1 ఓవర్లలోనే ఆ జట్టు విజయాన్ని నమోదు చేసింది. 

 

ఈ మ్యాచ్ అనంతరం కైఫ్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా.. కోల్కతా నైట్  రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు ఇర్ఫాన్ పఠాన్ కూడా కైఫ్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. కోల్కతా ఓ ఫన్నీ మీమ్ తో కామెంట్ చేయగా.. ఢిల్లీ మాత్రం  ‘మేం ఇప్పిటికే ఆర్టీఎం కార్డు వాడేసాం...’అని  రిప్లై ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios