ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్‌లో గాలిదుమారం.. నేలకొరిగిన వరల్డ్ కప్ హోర్డింగ్..
లక్నోలో ఆస్ట్రేలియా- శ్రీలంక మ్యాచ్‌కి వర్షం కారణంగా కాసేపు అంతరాయం... గాలిదుమారానికి కూలిన వరల్డ్ కప్ హోర్డింగ్, తప్పిన ప్రమాదం..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్న భారత్, ఇప్పటి వరకూ అన్ని మ్యాచులను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించగలిగింది. ధర్మశాలలో అవుట్ ఫీల్డ్ నాణ్యత గురించి కొన్ని విమర్శలు వచ్చినా, దాన్ని వెంటనే సరిచేయగలిగారు..
ఆసియా కప్‌ని ఇబ్బంది పెట్టిన వర్షాలు కూడా తగ్గడంతో అన్ని మ్యాచులు సజావుగానే ముగిశాయి. అయితే లక్నోలో జరుగుతున్న ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌లో ప్రకృతి కాస్త ఇబ్బంది పెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 43.3 ఓవర్లలో 209 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
32.1 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో కాసేపు మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. అయితే కొద్దిపాటి చినుకులు పడి వర్షం ఆగిపోవడంతో అరగంటకే ఆట మళ్లీ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే వర్షం రావడానికి ముందు రేగిన గాలిదుమారానికి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ నేలకొరిగి, స్టాండ్స్‌లో పడింది.
అదృష్టవశాత్తు ఆ ప్రదేశంలో ప్రేక్షకులు ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గాలి దుమారానికి గ్రౌండ్‌లో ఉన్న క్రికెటర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వర్షం తర్వాత ఆట తిరిగి ప్రారంభం కాగానే ధనంజయ డి సిల్వ వికెట్ కోల్పోయింది శ్రీలంక..
ఒకానొక దశలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసిన శ్రీలంక, 209 ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యఛేదనలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వికెట్లు త్వరగా కోల్పోయింది ఆస్ట్రేలియా. వార్నర్ 11 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ డకౌట్ అయ్యాడు. అయితే మిచెల్ మార్ష్ 52, మార్నస్ లబుషేన్ 40 పరుగుల చేసి ఆస్ట్రేలియాని ఆదుకున్నారు..