భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌‌గా బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 కొలువుదీరనుంది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి డీల్ వాల్యూ రూ.358 కోట్లు వుంటుందని అంచనా.  

టీమిండియా పురుషుల యూనిఫాంకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్‌‌గా బైజూస్ స్థానంలో డ్రీమ్ 11 కొలువుదీరనుంది. జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం జూన్ 14న బీసీసీఐ టెండర్ ప్రచురించింది. దీనికి డ్రీమ్ 11 స్పందించింది. ప్రముఖ గేమింగ్ ఫ్లాట్‌ఫాం గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి కూడా స్పాన్సర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ జెర్సీకి సంబంధించి నవంబర్ వరకు బైజూస్‌ బీసీసీఐతో ఒప్పందాన్ని కలిగి వుంది. 

అయితే మార్చిలో కంపెనీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి టీమిండియా జెర్సీపై స్పాన్సర్ లేడు. ఇటీవల లండన్ ఓవల్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎవరూ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు సరికొత్త ఆడిడాస్ ప్రాక్టీస్ జెర్సీలను మాత్రమే ధరించింది. జెర్సీపై లోగోను ముద్రించి ధరిస్తే.. టీమిండియా ఆడే ఒక్కో ద్వైపాక్షిక మ్యాచ్‌కు దాదాపు 5.5 కోట్లు బైజూస్‌ చెల్లించాలి. అదే ఐసీసీ టోర్నీ అయితే దాని విలువ రూ.1.7 కోట్లకు తగ్గుతుంది. డ్రీమ్ 11తో తాజా ఒప్పందం విలువ బైజూస్ బీసీసీఐకి చెల్లిస్తున్న దానికంటే తక్కువగా వుండొచ్చని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి డీల్ వాల్యూ రూ.358 కోట్లు వుంటుందని అంచనా. 

కాగా.. త్వరలో భారత్.. వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల టూర్‌ను ప్రారంభించనుంది. డొమినికాలో జూలై 12 నుంచి టెస్ట్ సిరీస్‌తో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు గాను పూజారాను తప్పించి రహానేకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. 17 మందితో కూడిన జట్టులో రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, యశస్వి జైస్వాల్‌‌కు కూడా చోటు కల్పించారు. చివరిసారిగా కరేబియన్ గడ్డపై పర్యటించిన టీమిండియా 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.