విహారి ఒంటిచేతి బ్యాటింగ్.. దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Hanuma Vihari: రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ సారథి హనుమా విహారి మధ్యప్రదేశ్ తో క్వార్టర్స్ పోరులో ఎడమ చేతికి గాయం కావడంతో ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసిన విషయం విదితమే.

టీమిండియా టెస్టు బ్యాటర్, ఆంధ్రా రంజీ క్రికెట్ టీమ్ సారథి హనుమా విహారి రంజీ ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్ తో క్వార్టర్స్ పోరులో ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసిన విషయం విదితమే. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ వేసిన బౌన్సర్.. విహారి ఎడమ చేతికి తాకడంతో అది ఫ్రాక్చర్ అయింది. దీంతో అతడు చేతికి కట్టు కట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో చివరి బ్యాటర్ గా వచ్చిన విహారి.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అలాగే క్రీజులోకి వచ్చాడు.
ఆంధ్రా రెండో ఇన్నింగ్స్ లో విహారి.. ఒంటిచేత్తో బ్యాటింగ్ చేస్తూనే రివర్స్ స్వీప్ ఆడాడు. సారాన్ష్ జైన్ వేసిన రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో విహారి.. లెఫ్ట్ హ్యాండ్ తో బ్యాట్ పట్టుకుని బంతిని రివర్స్ స్వీప్ చేశాడు. విహారి కొట్టిన ఆ షాట్.. రాకెట్ వేగంతో బౌండరీకి దూసుకెళ్లింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దీంతో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఈ వీడియోపై స్పందించాడు. ఇది రివర్స్ స్వీప్ కాదని, రివర్స్ స్లాప్ అని ఆ షాట్ కు కొత్త పేరు పెట్టాడు. ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ఈ రివర్స్ స్వీప్ కొన్ని కాలాల పాటు గుర్తుంటుంది. అన్‌బిలీవెబుల్..’అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ కు కార్తీక్ స్పందిస్తూ.. ‘ఇది రివర్స్ స్వీప్ కాదు. రివర్స్ స్లాప్...’అని ఫన్నీగా ట్వీట్ చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే క్వార్టర్స్ పోరులో ఆంధ్రా చేజేతులా ఓడింది. తొలి ఇన్నింగ్స్ లో 379 పరుగులు చేసిన ఆంధ్రా.. మధ్యప్రదేశ్ ను 228 పరుగులకే పరిమితం చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆంధ్రాకు 151 పరుగుల ఆధిక్యం దక్కింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి ఆంధ్రా విఫలమైంది. 32.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. దీంతో 245 పరుగుల లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు.. 77 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆంధ్రా ఇంటిముఖం పట్టగా మధ్యప్రదేశ్ మాత్రం సెమీస్ పోరుకు అర్హత సాధించినట్టైంది.