కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది. ఈ వైరస్ బారినపడి అన్ని క్రీడా సంగ్రామాలు అయితే వాయిదా పడడంతో రద్దవడమో జరుగుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి బారినపడి ఒలింపిక్స్ వచ్చే సంవత్సరానికి వాయిదాపడ్డ విషయం తెలిసిందే. 

ఇకపోతే.... ఎండాకాలం వచ్చిందంటేనే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ మార్చ్ 29న ప్రారంభం కావలిసి ఉన్నప్పటికీ.... దానిని రెండు వారాలపాటు వాయిదా వేసింది బీసీసీఐ. 

దేశంలో లాక్ డౌన్ పరిస్థితులే ఏప్రిల్ 14 వరకు ఉండడంతో నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదు. జులై నాటికి కూడా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడప్పుడే చెప్పే పరిస్థితుల్లో లేదు. 

Also read: ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు: దాదా మాటల్లోని ఆంతర్యం అదేనా...?

నిన్న గంగూలీ మాట్లాడిన మాటలను బట్టి ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దయ్యే ఆస్కారమే ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటివరకైతే... అధికారిక ప్రకటన రానప్పటికీ. ఐపీఎల్ ఆడదానికి ఎఫ్టీపి లో ఎక్కడా కూడా గ్యాపులు లేవు. 

ఇక ఇలా ఐపీఎల్ పై నీలి నీడలు కమ్ముకుంటుండడంతో చాలామంది ధోని కెరీర్ పరిస్థితి ఏమిటని మాట్లాడడం మొదలు పెట్టారు. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత మహేంద్రసింగ్‌ ధోని తొలిసారి మార్చి 29న మైదానంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ దెబ్బకు ధోని బ్యాటు పట్టుకుంటే చూద్దామనుకున్న అభిమానుల కలలు, కలలుగానే ఉండిపోతున్నాయి. 

చాలాకాలంగా ఆటకు దూరమైన దిగ్గజ క్రికెటర్‌ ఐపీఎల్‌తో సత్తా చాటితే 2020 వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం సాధిస్తాడని జట్టు కోచ్‌ రవిశాస్త్రి పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహి కెరీర్‌పై చిన్ననాటి కోచ్‌ బెనర్జీ స్పందించాడు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ రద్దు అనివార్యంగా తెలుస్తుందని బెనర్జీ అభిప్రాయపడ్డారు. దీనిపై బీసీసీఐ ప్రకటన కోసం ఎదురుచూడాల్సిందేనని అన్నారు. ఐపీఎల్‌ వాయిదా జాతీయ జట్టులో ఎం.ఎస్‌ ధోని స్థానాన్ని కఠినతరం చేసిందనడంలో సందేహం లేదని, కానీ... ఐపీఎల్‌ ఆడకపోయినా, 2020 వరల్డ్‌కప్‌ జట్టులో ధోని ఉంటాడని తన సిక్స్త్‌ సెన్స్‌ చెబుతోందని బెనర్జీ అన్నాడు. 

టీ20 వరల్డ్‌కప్‌ మహి కెరీర్‌కు ఆఖరు కానుందని బెనర్జీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ధోనికి చాలా కాలంగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదని, కానీ అపార అనుభవజ్ఞుడైన ధోనికి ఇది పెద్ద సమస్య కాబోదని, త్వరగానే టచ్‌లోకి రాగలడని ఆశాభావం వ్యక్తం చేసాడు. 

ధోని పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, చెన్నై నుంచి తిరిగొచ్చిన తర్వాత అతడితో మాట్లాడానని, ఇంటి ఆవరణలోనే జిమ్‌, బ్యాడ్మింటన్‌ కోర్టు, రన్నింగ్‌ కారిడార్‌ లలో కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటున్నాడని బెనర్జీ చెప్పాడు.