మహేంద్రసింగ్‌ ధోని వరల్డ్‌ క్రికెట్‌ అతిపెద్ద సూపర్‌ స్టార్‌ అని వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్నాడు. ఆన్ ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎం.ఎస్‌ ధోనితో మాట్లాడటం అత్యంత సులభమని కరీబియన్‌ క్రికెటర్‌ తెలిపాడు. 

జింబాబ్వే మాజీ పేసర్‌ తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో మాట్లాడిన బ్రావో.. అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌ డ్రెస్సింగ్‌రూమ్‌ అనుభవాలను గురించి అడటంతో ఎం.ఎస్‌ ధోనిపై ఈ వ్యాఖ్యలు చేశాడు. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయాలకు కెప్టెన్‌ ఎం.ఎస్‌ ధోని, కోచ్‌ స్టిఫెన్‌ ఫ్లెమింగ్‌, ప్రాంఛైజీ యాజమాన్యం ఘనత ఎంతో ఉందని, ప్రాంఛైజీ.... ధోని, ఫ్లెమింగ్‌లను గొప్పగా విశ్వసించిందని బ్రావో అభిప్రాయపడ్డాడు. 

అందుకే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవటంలోనైనా బయటవ్యక్తుల ప్రమేయం ఉండదని, క్రికెట్‌లో ధోని, ఫ్లెమింగ్‌ నిత్య విద్యార్థులని, ఆటగాళ్లు ధోనిని ప్రేమిస్తారని బ్రేవో చెన్నై సూపర్ కింగ్స్ టీం విషయాలను చెప్పాడు. 

ఆటగాడి సహజశైలి, వ్యక్తిత్వంతో మెలగగలిగే వాతావరణం ప్రాంఛైజీ నెలకొల్పిందని, క్రికెట్‌లో, తమ జట్టులో ఎం.ఎస్‌ ధోని అతిపెద్ద సూపర్‌స్టార్‌ అని, సులభంగా మాట్లాడేందుకు చనువు ఇచ్చే వ్యక్తుల్లో ధోని ఒకరని బ్రావో తెలిపాడు. 

వీడియో గేమ్స్‌ ఆడేందుకు ధోని ఎక్కువగా ఇష్టపడతాడని, జట్టు సహచరుల కోసం అతడి గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, తన కెరీర్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రత్యేకమైన జట్టని చెబుతూ మురిసిపోయాడు ఈ కరేబియన్ దిగ్గజం.  ఆ జట్టుకు ఎంతో మంది లాయల్ ఫాన్స్ ఉన్నారని కూడా బ్రావో చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక ఆటగాళ్ల బృందంలో బ్రావో ఒకరు. సూపర్‌ కింగ్స్‌కు 104 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించిన బ్రావో 121 వికెట్లు పడగొట్టాడు. 2013, 2015 సీజన్లలో పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు) అందుకున్నాడు. 2010, 2011, 2018 సీజన్లలో సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.