అక్టోబర్ నుంచి భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం ఐదు ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించనుంది.
ప్రపంచంలోనే అత్యంత అందమైన స్టేడియం అన్నా బహుశా ఎవరూ అభ్యంతరం చెప్పరు.. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. ఇంతకు ముందు ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్‌లు, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు జరిగాయి. అయితే తొలిసారిగా వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు ధర్మశాల ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం ఐసీసీ పురుషుల ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అందులో ధర్మశాలలో 5 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే బాధ్యతను స్వీకరించడానికి ఉత్సాహంగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ , ప్రస్తుత అధ్యక్షుడు అరుణ్ ధుమాల్‌ల కృషి కారణంగానే ధర్మశాలకు ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే గౌరవం దక్కిందన్నారు.
అక్టోబరు 7న ధర్మశాలలో వరల్డ్‌కప్ తొలి మ్యాచ్ ఉంటుందని ధుమాల్ తెలిపాడు. ఆ రోజు బంగ్లాదేశ్- ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరగనుంది. తర్వాత అక్టోబర్ 10న బంగ్లాదేశ్-ఇంగ్లాండ్ , అక్టోబర్ 15న క్వాలిఫయర్స్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్, 28న ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ధర్మశాల స్టేడియం అవుట్‌ఫీల్డ్ పునరుద్ధరించారు. ఈ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. అయితే ఔట్‌ఫీల్డ్ సిద్ధంగా లేకపోవడంతో ఆ మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు అవుట్ ఫీల్డ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అందుకే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడంలో ధర్మశాలకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు.
కాగా.. అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచకప్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 46 రోజులపాటు దేశవ్యాప్తంగా పది నగరాలలో ఈ మెగాటోర్నీ జరగనుంది.
టీమిండియా వరల్డ్ కప్ - 2023 షెడ్యూల్ :
- అక్టోబర్ 8, చెన్నై : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
- అక్టోబర్ 11, ఢిల్లీ : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్
- అక్టోబర్ 15, అహ్మదాబాద్ : ఇండియా వర్సెస్ పాకిస్తాన్
- అక్టోబర్ 19, పూణె : ఇండియా వర్సస్ బంగ్లాదేశ్
- అక్టోబర్ 22, ధర్మశాల : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- అక్టోబర్ 29, లక్నో : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్
- నవంబర్ 02, ముంబై : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
- నవంబర్ 05, కోల్‌కతా : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా
- నవంబర్ 11, బెంగళూరు : ఇండియా వర్సెస్ క్వాలిఫయర్
