యువ ఆటగాడు రిషభ్ పంత్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ చేతులేత్తేసింది. ఐపీఎల్‌లో భాగంగా సోమవారం జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్‌పై  ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్ధాన్ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శాంసన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే రహానే, స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.

ముఖ్యంగా రహానె దూకుడుగా ఆడాడు. ఫోర్లు , సిక్సర్లతో విరుచుకుపడిన అతను కేవలం 32 బంతుల్లో అర్థసెంచరీ.. ఆ తర్వాత మరో 26 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ క్రమంలో స్మిత్ కూడా బ్యాట్ ఝళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది.

దీంతో రాజస్ధాన్ 200 దాటుతుందని అంతా భావించారు. అయితే అక్షర్ స్మిత్‌ను ఔట్ చేయడంతో పాటు స్టోక్స్, టర్నర్ వరుసగా పెవలియన్ చేరడంతో రాజస్ధాన్ రాయల్స్ వేగంగా పరుగులు చేయలేకపోయింది.

రహానె క్రీజులో ఉన్నప్పటికీ ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీషా, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్ని అందించారు.

సిక్సర్లు, ఫోర్లతో రాజస్ధాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ధావన్‌ 54‌ను శ్రేయాస్ గోపాల్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ శ్రేయాస అయ్యార్ కూడా వెనుదిరగడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది.

60 బంతుల్లో 111 పరుగులు చేయాల్సిన స్థితిలో రిషభ్ పంత్ దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌ను సెట్ చేశాడు. ఈ స్థితిలో పృథ్వీషాను గోపాల్ ఔట్ చేయడంతో ఢిల్లీ కాస్త ఒత్తిడిలో పడింది. కానీ పంత్ మాత్రం దూకుడు తగ్గించలేదు.

చివరి రెండు ఓవర్లలో వరుస సిక్సర్లతో ఢిల్లీని ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ విజయంతో 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.