ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించేందుకు గాను ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. కాగా ఢిల్లీ కాలుష్యం బారిన క్రికెటర్లు సైతం పడ్డారు.

టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంగ్లా క్రికెటర్లు సౌమ్య సర్కార్, మరో బంగ్లాదేశ్ ఆటగాడు మైదానంలో వాంతులు చేసుకున్నట్లు సమాచారం.

దీపావళికి ముందు నుంచే దేశ రాజధాని ప్రాంతంలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. పండగ తర్వాత నగరంలో గాలి నాణ్యత సూచీ తీవ్రత 999 దాటింది. శ్వాస పీల్చుకోవడానికి ఇరుజట్ల ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తోంది.

Also Read:అప్పుడు ధోనీ... ఇప్పుడు కోహ్లీ... గంగూలీ సారధ్యంపై భజ్జీ కామెంట్స్

మరోవైపు ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం బంగ్లా క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ మాట్లాడుతూ.. తనకు కాలుష్యంతో ఇబ్బందేమీ లేదని.. భారత బౌలర్లను ఎదుర్కోవడంపైనే తాను ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలిపాడు.

వాతావరణ పరిస్థితుల గురించి ఆటగాళ్లు ఆలోచించికూడదని.. కేవలం విజయం సాధించడంపైనే దృష్టి సారించాలని రహీమ్ సూచించాడు. మరోవైపు కాలుష్యం వేధించినా మ్యాచ్ ఆడినందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇరు జట్ల ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా గురువారం జరగనుంది. ఈ టీ20కి ‘మహా’ తుఫాను కారణంగా ముప్పు పొంచివుంది. 

ధోనీ భవిష్యత్తుపై యూవీ కామెంట్... గ్రేట్ సెలక్టర్లు ఉన్నారుగా...

దేశ రాజధాని ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి మించిపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. వాయు కాలుష్యాన్ని అంచనా వేసేందుకు పీఎంవో ముఖ్యకార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది.

ఇందులో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ఈ కమిటీ ప్రతిరోజు రోజువారీ కాలుష్య పరిస్ధితులను పర్యవేక్షించనుంది.

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సుమారు 300 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇందుకు అవసరమైన సామాగ్రిని సైతం వారికి అందజేశామని పీకే మిశ్రా తెలిపారు. ఇక 7 పారిశ్రామిక క్లస్టర్‌లు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు మిశ్రా వెల్లడించారు. 

మరోవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీలో నివసించేందుకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేస్తుండటంతో వాహనదారులు స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం నిలిపివేయాలని ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది.