Asianet News TeluguAsianet News Telugu

అశ్విన్‌ను గుర్తు చేసిన దీప్తి శర్మ.. వివాదాస్పదమైన రనౌట్..

INDW vs ENGW: టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ  శనివారం లార్డ్స్ లో చేసిన రనౌట్ వివాదాస్పదమైంది. నిన్నటివరకు ‘మన్కడింగ్’గా పిలిచిన ఆ రనౌట్ పై మళ్లీ వివాదం రాజుకుంది. 

Deepti Sharma Mankads England Batter charlie Dean at Lords, Twitter Can't keep Calm
Author
First Published Sep 25, 2022, 11:50 AM IST

లార్డ్స్ లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ తో ముగిసిన మూడో వన్డేలో కూడా ఆ జట్టును చిత్తుగా ఓడించి  సిరీస్ ను 3-0తో గెలుచుకుంది. అయితే ఈ వన్డేలో ఇంగ్లాండ్  బ్యాటర్ చార్లీ డీన్ రనౌట్ వివాదాస్పదమైంది.  వరుసగా వికెట్లు కోల్పోతున్నా జట్టును లోయరార్డర్ బ్యాటర్లతో కలిసి విజయతీరాలకు చేర్చడానికి యత్నిస్తున్న డీన్ ను దీప్తి శర్మ రనౌట్ చేసింది. నిన్నా మొన్నటివరకు ‘మన్కడింగ్’ అని పిలిచిన ఈ రనౌట్ రూపంలో దీప్తి శర్మ.. డీన్ ను ఔట్ చేయడమే వివాదానికి కేంద్ర బింధువైంది. 

ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  అప్పటికే టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో  చివరి వరుస బ్యాటర్లతో డీన్  (80 బంతుల్లో 47, 5 ఫోర్లు) ఇంగ్లాండ్ ను విజయానికి  చేరువ చేసింది. 

44వ ఓవర్ ను వేయాల్సిందిగా హర్మన్‌ప్రీత్ కౌర్.. దీప్తి శర్మకు బంతినిచ్చింది. ఆ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన డీన్.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు వెళ్లింది.  మూడో బంతిని వేయబోయిన దీప్తి.. డీన్  నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి చాలా ముందుకు జరగడాన్ని గ్రహించింది. దీంతో వెంటనే బంతిని విసరడం ఆపి   వికెట్లను గిరాటేసింది. అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. 

 

అయితే రివ్యూలో దీప్తి.. బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసిన తర్వాతే వికెట్లను గిరాటేసినట్టు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు.  కానీ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మాత్రం ఇది కూడా ఐపీఎల్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ను ఔట్ చేసిన విధంగానే చూస్తూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాళ్లకేదో అన్యాయం జరిగిపోయినట్టు  సోషల్ మీడియాలో పోస్టులు కుమ్మరిస్తున్నారు. అయితే అంపైర్ అవుటిచ్చాక అందులో వివాదమేముంది..? అని టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. 

 

ఈ తరహా రనౌట్లను  నిన్నా మొన్నటి వరకు మన్కడింగ్ అని పిలిచేవారు. కానీ క్రికెట్ చట్టాలు చేసే మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవలే మన్కడింగ్ పదాన్ని వాడకుండా ఆ రనౌట్ ను చట్టబద్దం చేసింది. ఇక మ్యాచ్ ముగిశాక టీమిండియా అభిమానులు దీప్తి శర్మను మరో అశ్విన్ లా పోల్చుతూ  మీమ్స్, ట్వీట్స్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios