T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న జస్ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టడంతో అతడి స్థానంలో భర్తీ చేసే ఆటగాడు ఎవరు..? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతున్నది. తాజాగా మరో పేసర్ కూడా ఆసీస్ కు వెళ్లేది అనుమానమే..
పదిహేనేండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ను భారత్ కు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత జట్టుకు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో అతడి రిప్లేస్‌మెంట్ వెతకాల్సిన పని పడింది. అయితే ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్న మహ్మద్ షమీ.. ఫిట్నెస్ టెస్టు క్లీయర్ చేసుకుని ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. షమీ ఫిట్నెస్ క్లీయర్ చేశాడనేది శుభవార్తే అయినా స్టాండ్ బై ప్లేయర్లలో ఒకడైన దీపక్ చాహర్ ఇంకా కోలుకోకపోవడం భారత్ కు బ్యాడ్ న్యూస్.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్న దీపక్ చాహర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలుస్తున్నది. అతడికి ఇంకా ఫిట్నెస్ టెస్టు కూడా నిర్వహించలేదు. దీంతో అతడు ఆసీస్ కు వెళ్లేది అనుమానమే అని అతడి స్థానంలో మరో ఇద్దరు పేస్ బౌలర్లకు ఆస్ట్రేలియాకు పంపేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
దీపక్ చాహర్ ఇంకా కోలుకోకపోవడం, ఆస్ట్రేలియాలో ఉన్న హర్షల్ పటేల్ ఇంకా పూర్తి స్థాయిలో పాత రిథమ్ ను అందుకోకపోవడంతో షమీతో పాటు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో మెరిసిన మహ్మద్ సిరాజ్ (మియా), శార్దూల్ ఠాకూర్ (లార్డ్) లను పంపనున్నట్టు తెలుస్తున్నది. బౌన్స్, పేస్ పిచ్ ల మీద సిరాజ్, శార్దూల్ లు ఆడిన అనుభవంతో పాటు అక్కడ రాణించే సామర్థ్యం కూడా ఉన్నవాళ్లు కావడంతో ఈ ఇద్దరినీ ఆసీస్ కు పంపిస్తున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడానికి భారత జట్టుకు ఈ నెల 15వరకు ఛాన్స్ ఉంది. ఆలోపు టీ20 ప్రపంచకప్ కు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికైన శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్ లతో పాటు షమీ, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కూడా వెళ్లనున్నారు. ఒకవేళ ఈ రెండ్రోజుల్లో చాహర్ గనక ఫిట్నెస్ టెస్టు క్లీయర్ అయితే శార్దూల్ స్థానంలో అతడే ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలుంటాయి. అయితే దీనిపై స్పష్టమైన ప్రకటన రావాలంటే ఈనెల 15వరకు వేచి ఉండాల్సిందే.
టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఈనెల 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది. అంతకంటే ముందుగానే 13న వెస్టర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.
