ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ద్వారక రవితేజ... మేఘాలయ తరుపున ఆఖరి మ్యాచ్‌ ఆడి రిటైర్మెంట్... 

హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్ రవి తేజ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 33 ఏళ్ల రవి తేజ పూర్తి పేరు ద్వారక రవి తేజ. కాకనాడలో జన్మించిన రవి తేజ, 2006లో అండర్ 19 జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. 2006 నవంబర్ 23న మహరాష్ట్రపై ఫస్ట్ క్లాస్ ఎంట్ర ఇచ్చిన రవి తేజ, చివరిగా 2017లో త్రిపురపై ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు...

 2012 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ద్వారక రవి తేజ, 2013 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి ఆడాడు. తన కెరీర్‌లో 65 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన రవితేజ, 9 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 3887 పరుగులు చేశాడు...

బౌలింగ్‌లోనూ రాణించిన రవి తేజ, 28 వికెట్లు పడగొట్టాడు. 60 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 5 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలతో 2108 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుని 18 వికెట్లు తీశాడు. 69 టీ20 మ్యాచుల్లో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 1203 పరుగులు చేశాడు... 

రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు మేఘాలయ జట్టు తరుపున రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో బరిలో దిగాడు రవి తేజ. రాజ్‌కోట్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రవి తేజ, శతకంతో తన కెరీర్‌కి ముగింపు పలికాడు...

ఇండియా ఏ తరుపున, అండర్ 19 టీమ్స్ తరుపున ఆడేందుకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపిన రవి తేజ... తన రిటైర్మెంట్ పోస్టులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్స్‌, మేఘాలయ క్రికెట్ అసోసియేషన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్లకి కూడా థ్యాంక్స్ చెప్పాడు... 

ఐపీఎల్ కెరీర్‌లో 32 మ్యాచులు ఆడిన ద్వారక రవి తేజ, 25 ఇన్నింగ్స్‌ల్లో 19.74 సగటుతో 375 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 60 పరుగులు. మూడు మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చిన రవి తేజ, రెండు సార్లు ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

View post on Instagram

ఐపీఎల్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన రవి తేజ, 28 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయగలిగాడు. ఐపీఎల్‌లో వేసిన మొదటి బంతికే వికెట్ తీసిన అతి కొద్ది మంది బౌలర్లలో రవితేజ ఒకడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, తన జీవితంలో క్రికెట్ ఎప్పుడూ ఓ భాగంగా ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు చేశాడు ద్వారక రవి తేజ. 

రవి తేజ రిటైర్మెంట్‌పై భారత క్రికెటర్ హనుమ విహారి స్పందించాడు. ‘వండర్‌‌ఫుల్ కెరీర్‌కి కంగ్రాట్స్ అన్న... ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో నువ్వే నా మొదటి కెప్టెన్‌వి. కెప్టెన్‌గా, టీమ్ మేట్‌గా నువ్వు ఇచ్చిన సపోర్ట్‌ ఎప్పటికీ మరిచిపోలేను. నీ సెకండ్ ఇన్నింగ్స్‌కి గుడ్ లక్...’ అంటూ కామెంట్ చేశాడు భారత టెస్టు ప్లేయర్ హనుమ విహారి.