SL vs AUS: గాలే లో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక అద్భుతం చేసింది. తొలుత బ్యాటింగ్ లో రెచ్చిపోయిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లో కూడా అదరగొట్టింది.  

శ్రీలంక పర్యటనను ఆస్ట్రేలియా ఓటమితో ముగించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియా నుంచి నేరుగా శ్రీలంకకు వెళ్లిన ఆసీస్ ఆటగాళ్లు.. టీ20 సిరీస్ నెగ్గి వన్డే సిరీస్ ఓడి టెస్టు సిరీస్ ను డ్రా చేసుకున్నారు. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో కంగారూలు లంక స్పిన్ మాయాజాలానికి తలొగ్గారు. అరంగేట్ర స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ దాటికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 151 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో లంకను విజయం వరించింది.

తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 364 పరుగులు చేయగా లంక 554 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో దినేశ్ చండిమాల్ (206 నాటౌట్) డబుల్ సెంచరీ సాధించాడు. అతడితో పాటు కెప్టెన్ దిముత్ కరుణరత్నె (86), కుశాల్ మెండిస్ (85), మాథ్యూస్ (52), కమిందు మెండిస్ (61) లు రాణించారు. ఫలితంగా లంక.. తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు వెనుకబడి ఉంది. 

ఆట నాలుగో రోజు రెండో సెషన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్ కు జయసూర్య, రమేశ్ మెండిస్ లు చుక్కలు చూపించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (24) ను మెండిస్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా.. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా (29), స్టీవ్ స్మిత్ (0) లను ఔట్ చేసి ఆసీస్ ను కోలుకోలేని దెబ్బతీశాడు జయసూర్య. అదే క్రమంలో మెండిస్.. ట్రావిస్ హెడ్ (5) ను కూడా బౌల్డ్ చేశాడు. 

Scroll to load tweet…

అయితే ఆ సమయంలో మార్నస్ లబూషేన్ (32)తో కలిసి కామెరాన్ గ్రీన్ (23) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఐదో వికెట్ కు 38 పరుగులు జోడించిన ఈ జోడీని జయసూర్య విడదీశాడు. అతడు వేసిన 30వ ఓవర్లో లబూషేన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ ముగియడానికి పెద్ద సమయం పట్టలేదు. మిచెల్ స్టార్క్ ను జయసూర్య ఔట్ చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (16) , నాథన్ లియాన్ (5) లను మహేశ్ తీక్షణ పెవిలియన్ కు పంపాడు చివరగా స్వెప్సన్ (0) ను జయసూర్య బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 151 పరుగుల వద్ద ముగిసింది.

లంక బౌలర్లలో జయసూర్య కు ఆరు వికెట్లు దక్కగా మెండిస్, తీక్షణ కు తలో రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ లో కూడా జయసూర్య 6 వికెట్లు తీయడం గమనార్మం. ఆడుతున్న తొలి టెస్టులోనే అతడు ఏకంగా 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ మ్యాచ్ లో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. దినేష్ చండిమాల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.