IPL 2020: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌‌కి ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆరు అడుగులకు పైగా ఎత్తు ఉండే ఈ ఆజానుబాహుడు, క్రీజులో ఉండే బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టాల్సిందే. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో క్రిస్ గేల్ ఒకడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 119 మ్యాచులు ఆడిన గేల్, 4316 పరుగులు చేశాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు, అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ కూడా క్రిస్‌గేల్‌యే. అంతేనా అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా గేల్‌దే. పూణేపై 175 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు గేల్. అలాంటి గేల్‌ను పక్కనబెట్టి, మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకున్నాడు కెఎల్ రాహుల్. దీనికి ప్రధాన కారణం ఇంగ్లాండ్‌పై జరిగిన చివరి వన్డేలో మ్యాక్స్‌వెల్ సెంచరీతో అదరగొట్టాడు. దాంతో ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ కోసం... మ్యాక్సిమం సిక్సర్లు కొట్టే గేల్‌ను పక్కనబెట్టాడు రాహుల్.

అయితే 11 సీజన్లలో ఓపెనింగ్ మ్యాచుల్లో అదరగొట్టాడు గేల్. ఓ సెంచరీతో పాటు ఐదు సార్లు 50+ స్కోర్ చేశాడు. 2012, 2016, 2009 సీజన్లలో మాత్రమే ఓపెనింగ్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. గత సీజన్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌లో 43 బంతుల్లో 79 పరుగులు చేసిన గేల్‌ను పక్కనబెట్టడం పంజాబ్‌కి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.