Asianet News TeluguAsianet News Telugu

Dc vs KXIP IPL 2020 2nd Match Live Updates: సూపర్ ఓవర్‌లో ఢిల్లీ సూపర్ విక్టరీ...

సూపర్ ఓవర్‌లో ఢిల్లీ సూపర్ విక్టరీ...

సూపర్ ఓవర్‌లో 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన రబాడా...

గేల్ లేకపోవడంతో మూల్యం చెల్లించుకున్న పంజాబ్...

Dc vs KXIP IPL 2020 2nd Match Live Updates:  Delhi Super Win in Super over CRA
Author
India, First Published Sep 20, 2020, 11:42 PM IST

IPL 2020: 13వ సీజన్‌లో రెండో మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి వెళ్లింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ కేవలం 2 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ 3 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించింది. 

 అంతకుముందు సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయానికి  ఆఖరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సిన దశలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది పంజాబ్. మొదటి ఇన్నింగ్స్‌లో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా ఆకట్టుకోగా, ఆఖర్లో స్టోయినిస్ సూపర్ షో కారణంగా అన్యూహ్యంగా 157 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

పంజాబ్‌కి మంచి ఆరంభం దక్కినా... అన్యూహ్యంగా పుంజుకున్న ఢిల్లీ బౌలర్లు కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్, 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
కృష్ణప్ప గౌతమ్‌తో కలిసి వికెట్ల పతనాన్ని కాసేపు ఆపాడు మయాంక్ అగర్వాల్. అయితే 14 బంతుల్లో 20 పరుగుల చేసిన గౌతమ్‌ను రబాడా అవుట్ చేయడంతో 101 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది పంజాబ్. 

అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు మయాంక్ అగర్వాల్. ఆఖరి 18 బంతుల్లో 42 పరుగులు కావాల్సిన దశలో 2 సిక్సర్లు బాది... మ్యాచ్‌పై ఆశలు నిలిపాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఒంటి చేత్తో విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో అవుట్ అయ్యాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో పంజాబ్ వికెట్ కోల్పోవడంతో స్కోర్లు సమం అయ్యాయి. . 

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన అశ్విన్, గాయంతో క్రీజులో నుంచి వెనుదిరిగాడు. రబాడా రెండు, అక్షర్ పటేల్, మోహిత్ శర్మ చెరో వికెట్ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios