ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు సొంత గడ్డపై పాక్ తో టెస్టు సిరీస్ కోసం తలపడుతోంది.  కాగా... ఈ సిరీస్ లో.. ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. 335 పరుగులు చేసి జట్టు గెలుపుకి సహకరించాడు. 400 పరుగులు కూడా చేసే అవకాశం ఉందంటూ అందరూ వార్నర్ పై ప్రశంసలు కురిపించారు. 

కాగా... వార్నర్ విజయంపై ఆయన భార్య  క్యాండిక్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె... మహాత్మాగాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

‘శారీరక సామర్థ్యంతో బలం రాదు..ధృఢ సంకల్పంతోనే అది సిద్ధిస్తుంది’ అనే గాంధీ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘‘ నీగురించి ఇతరులు ఏం నమ్ముతారని కాదు.. నీపై నువ్వు ఏ నమ్మకంతో ఉన్నావన్నదే ముఖ్యం’ అంటూ భర్తను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు.

కాగా... టెస్టు సిరీస్ లో ట్రిపుల్ సెంచరీ చేసి వార్నర్ సంచలనం సృష్టించాడు. అందరూ 400 పరుగులు చేస్తాడని ఆశపడగా... ఆస్ట్రేలియా జట్టు డిక్లేర్ చేసింది. దీనిపై కూడా వార్నర్ స్పందించాడు.  

‘‘ నా ఆట గురించి నేనే చెప్పగలను. మైదానంలో బౌండరీలు చాలా పెద్దవి. వేగంగా పరుగులు చేయడం అంత సులువు కాదు. తీవ్రంగా అలసిపోయిన తర్వాత మరింత శ్రమించడం, ఏదోలా పరుగుల కోసం ప్రయత్నించడం కష్టంగా మారుతుంది. చివర్లో నేను బౌండరీలు కొట్టలేక సింగిల్స్ తీస్తూ పోయాను. అయితే... 400 పరుగుల ఘనతను సాధించగల ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్ శర్శ పేరు మాత్రం చెప్పగలను’ అని పేర్కొన్నాడు.