రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ మోచేతికి గాయం... టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్న డేవిడ్ వార్నర్! వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో మొదటి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హజల్‌వుడ్ గాయం కారణంగా స్వదేశానికి పయనం కాగా తాజాగా మరో ప్లేయర్ గాయంతో చివరి రెండు టెస్టులకి దూరమయ్యాడు...
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో గాయపడిన డేవిడ్ వార్నర్, గాయం కారణంగా మిగిలి రెండు టెస్టులకి దూరమయ్యాడు. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్ సమయానికైనా వార్నర్ కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.. అయితే టెస్టు సిరీస్‌కి దూరమైనా డేవిడ్ వార్నర్ వన్డే సిరీస్‌లో ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా..
ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన రాకాసి బౌన్సర్, నేరుగా వచ్చి డేవిడ్ వార్నర్ మోచేతికి బలంగా తాకింది. ఫిజియో పర్యవేక్షణ తర్వాత కాసేపు బ్యాటింగ్ కొనసాగించిన డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
గాయం కారణంగా డేవిడ్ వార్నర్, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి రాలేదు. అతని స్థానంలో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్ రెంషాని టీమ్‌లోకి తీసుకొచ్చింది ఆస్ట్రేలియా. రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజాతో కలిసి ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ చేశాడు..
డేవిడ్ వార్నర్ గాయం కారణంగా టోర్నీ నుంచి దూరం అయినా ఆస్ట్రేలియాకి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే వార్నర్ స్థానంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేసిన ట్రావిస్ హెడ్, దూకుడుగా బ్యాటింగ్ చేసి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు...
46 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి, వారిని ఒత్తిడిలో పడేశాడు. ట్రావిస్ హెడ్‌తో ఓపెనింగ్ చేయించి, కామెరూన్ గ్రీన్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడించేందుకు ఆస్ట్రేలియాకి లైన్ క్లియర్ అయినట్టు అయ్యింది..
మిచెల్ స్టార్క్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులో ఆస్ట్రేలియా మరింత స్ట్రాంగ్‌గా బరిలో దిగుతోంది. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి బయలుదేరిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మూడో టెస్టు ఆరంభమయ్యే సమయానికి తిరిగి రాబోతున్నాడు...
షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు జరగాలి. అయితే శీతాకాలం కురిసిన మంచు కారణంగా ధర్మశాల స్టేడియం అవుట్ ఫీల్డ్ పూర్తిగా పాడైంది. దీంతో ధర్మశాల నుంచి ఇండోర్‌కి మూడో టెస్టు మారింది. ఈ స్టేడియంలో రవిచంద్రన్ అశ్విన్‌కి అద్భుతమైన రికార్డు ఉండడతో ఆస్ట్రేలియా బ్యాటర్లు భయపడుతున్నారు...
తొలి రెండు టెస్టుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన రవీంద్ర జడేజా, ఆస్ట్రేలియాని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే స్వదేశంలో అదిరిపోయే రికార్డు ఉన్న అక్షర్ పటేల్, బ్యాటుతో ఆకట్టుకుంటున్నా.. తొలి రెండు టెస్టుల్లో బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పటిదాకా అక్షర్ పటేల్ ఈ టెస్టు సిరీస్‌లో ఒకే ఒక్క వికెట్ తీయడం విశేషం.
