టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్... లబుషేన్ సెంచరీ, సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..
ఓపెనర్‌గా 46 అంతర్జాతీయ సెంచరీలు బాదిన డేవిడ్ వార్నర్... వన్డేల్లో 20వ సెంచరీ, మార్నస్ లబుషేన్ సెంచరీతో ఆస్ట్రేలియా భారీ స్కోరు..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా సూపర్ ఫామ్‌ని అందుకుంటోంది. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న డేవిడ్ వార్నర్, సెన్సేషనల్ సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 392 పరుగుల భారీ స్కోరు చేసింది.
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ కలిసి తొలి వికెట్‌కి 109 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 36 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, షంషీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌ని గోల్డెన్ డకౌట్ చేశాడు షంషీ..
డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి మూడో వికెట్‌కి 151 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 93 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్... వన్డేల్లో 20వ సెంచరీ అందుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో డేవిడ్ వార్నర్‌కి ఇది 46వ సెంచరీ. టెస్టుల్లో 25, టీ20ల్లో ఓ సెంచరీ బాదాడు వార్నర్..
ఓపెనర్‌గా 45 అంతర్జాతీయ సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డును డేవిడ్ వార్నర్ అధిగమించేశాడు. అయితే నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్ 48 సెంచరీలు చేసి టాప్‌లో ఉన్నాడు... ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ (77 సెంచరీలు) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా తన ప్లేస్‌ని మళ్లీ దక్కించుకున్నాడు డేవిడ్ వార్నర్. సెంచరీ తర్వాత ఫెహ్లుక్వాయో బౌలింగ్‌లో వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
ఓపెనర్‌గా వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 140 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించగా రోహిత్ శర్మ 121 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ అందుకుని టాప్‌లో ఉన్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా 9200 పరుగులు చేయగా ఆ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ ఓపెనర్‌గా ఉన్నాడు డేవిడ్ వార్నర్..
జోష్ ఇంగ్లీష్ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. ఆసీస్ తరుపున తొలి వన్డే ఆడుతున్న టిమ్ డేవిడ్ 1 పరుగుకే అవుట్ కాగా అలెక్స్ క్యారీ 6, ఆరోన్ హార్డీ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు..
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మార్నస్ లబుషేన్ 99 బంతుల్లో 19 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 124 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నాథన్ ఎల్లీస్ 14, సీన్ అబ్బాట్ 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. తొలి వన్డేలో కామెరూన్ గ్రీన్ గాయపడడంతో కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా తుది జట్టులోకి వచ్చి, 80 పరుగులు చేసి ఆసీస్ గెలిపించాడు మార్నస్ లబుషేన్.
మార్నస్ లబుషేన్ ఉన్న ఫామ్‌లో అతనికి వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కినా దక్కొచ్చు.. ఆఖరి నిమిషంలో ఏ ప్లేయర్ ప్లేస్‌లో అయినా లబుషేన్‌ని ఇరికించే ప్రయత్నం చేస్తుంది ఆసీస్..