బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం అందుకున్న ఆస్ట్రేలియా... వరుసగా 7 మ్యాచుల్లో గెలిచి, అజేయంగా ప్లేఆఫ్స్‌లోకి ఆస్ట్రేలియా... 

ఐసీసీ వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆస్ట్రేలియా, లీగ్ స్టేజ్‌ను క్లీన్ స్వీప్ చేసేసింది. వరుసగా ఏడు మ్యాచుల్లో విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా మహిళా జట్టు... అజేయంగా ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు...

వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి థ్రిల్లింగ్ అనుభవాన్నిచ్చింది. టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళా జట్టు, నిర్ణీత 43 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేయగలిగింది...

ముర్సీదా ఖటున్ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేయగా షర్మీన్ అక్తర్ 5 బంతుల్లో 2 ఫోర్లతో 24 పరుగులు చేసింది. ఫర్గానా హక్ 8 పరుగులు చేసి అవుట్ కాగా కెప్టెన్ నిగర్ సుల్తానా 30 బంతుల్లో 7 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచింది.

రుమనా అహ్మద్ 45 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేయగా, లతా మొండల్ 63 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసింది. సల్మా ఖటున్ 23 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేయగా నహీదా అక్తర్ 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది...

సౌతాఫ్రికాపై 270+ పరుగుల భారీ టార్గెట్‌ను ఈజీగా ఛేదించి.. డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా జట్టు... ఈ లక్ష్యాన్ని ఈజీగా కొట్టేస్తుందని అనుకున్నారంతా. అయితే బంగ్లా బౌలర్ల నుంచి ఆసీస్‌కి ఊహించని ప్రతిఘటన ఎదురైంది...

22 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన ఆలీసా హేలీని అవుట్ చేసిన సల్మా ఖటున్, బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను డకౌట్ చేసింది. రచెల్ హేన్స్ 23 బంతుల్లో 7 పరుగులు చేసి సల్మా ఖటున్ బౌలింగ్‌లోనే అవుట్ కాగా తహిలా మెక్‌గ్రాత్ 11 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

అస్‌లీగ్ గార్డనర్ 16 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి అవుట్ కావడంతో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. అయితే అన్నాబెల్ సూథర్‌లాండ్‌తో కలిసి ఆరో వికెట్‌కి 66 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన బేత్ మూనీ, ఆసీస్‌కి అద్భుత విజయం అందించింది...

అన్నాబెల్ 39 బంతుల్లో ఓ ఫోర్‌తో 26 పరుగులు చేయగా 75 బంతుల్లో 5 ఫోర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన బేత్ మూనీ... ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచింది. 

వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా రేపు న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే పాకిస్తాన్ ఆఖరి పొజిషన్ నుంచి పైకి రావడానికి ఈ మ్యాచ్ విజయం సాయపడుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లాండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచులు ప్లేఆఫ్స్ చేరే జట్లను నిర్ణయించబోతున్నాయి...

6 పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌ను ఓడిస్తే నేరుగా ఫ్లేఆఫ్స్‌ చేరుతుంది. అలాగే సౌతాఫ్రికాపై టీమిండియా విజయం అందుకుంటే, ప్లేఆఫ్స్ చేరుతుంది, ఓడితే గ్రూప్ స్టేజ్‌ నుంచే నిష్కమిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే 7 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరుకుంటుంది భారత జట్టు. అప్పుడు 7 పాయింట్లతో ఉన్నా, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో వెస్టిండీస్‌కి నిరాశ తప్పదు...