ఐపీఎల్... క్రికెట్‌లో పిచ్చ క్రేజ్ ఉన్న లీగ్. బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే బంగారు బాతు. మామూలుగానే ఐపీఎల్ సీజన్ మొదలైతే... పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. ఐపీఎల్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ ఉంటాయి టీవీ సీరియల్స్. అయితే కరోనా కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది ఈ ఏడాది ఐపీఎల్ సీజన్. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతబడడంతో సరైన కాలక్షేపం కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మంచి మజాను అందిస్తోంది. 

ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఛాలెంజింగ్‌గా నిర్వహిస్తున్న ఈ ఐపీఎల్‌ ప్రారంభమ్యాచ్ రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను 20 కోట్ల మంది వీక్షించారట. స్టార్ స్టోర్స్ ఛానెల్ ద్వారా టీవీలో, డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా మొబైల్స్ ద్వారా మ్యాచ్‌ను వీక్షించిన వారి సంఖ్య 20 కోట్ల మందికి పైనే ఉంటుందని అంచనా. ఇంతకుముందు ఏ దేశంలోనూ, ఏ లీగ్‌కి ఈ రేంజ్‌లో వ్యూయర్‌షిప్ రాలేదు.

 

 

లాక్‌డౌన్ కారణంగా ‘అల వైకుంఠపురం’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాలు కూడా రికార్డు లెవెల్లో టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న టైమ్‌లో, అసలు సిసలు క్రికెట్ మజాను అందిస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు ఈ రేంజ్‌లో వ్యూయర్ షిప్ రావడంలో ఎలాంటి డౌటూ లేదంటున్నారు విశ్లేషకులు. చాలా రోజుల తర్వాత మాహీ రీఎంట్రీ ఇవ్వడం కూడా మొదటి మ్యాచ్‌కి ఈ స్థాయిలో ఆదరణ దక్కడానికి ఓ కారణం.