జూన్ 9 నుంచి భారత పర్యటనకు సౌతాఫ్రికా జట్టు... ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా... 21 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్‌కి తొలి అవకాశం... 

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో కలిసి స్వదేశంలో ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత జట్టు.. జూన్ 9న మొదలయ్యే ఈ టీ20 సిరీస్, 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆఖరి టీ20తో ముగియనుంది. తాజాగా ఈ టీ20 సిరీస్‌కి జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు...

తెంబ భవుమా కెప్టెన్‌గా వ్యవహరించే ఈ టీ20 సిరీస్‌లో క్వింటన్ డి కాక్, అయిడిన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, ఆన్రీచ్ నోకియా, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డేర్ దుస్సేన్, మార్కో జాన్సెన్, రీజా హెండ్రిక్స్, హెన్రీచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, వేన్ పార్నెల్, తబ్రేజ్ షంసీలకు చోటు దక్కింది... 

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకి ఎంపికై, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌, టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు. ట్రిస్టన్ స్టబ్స్‌కి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ సిరీస్ కానుంది. సౌతాఫ్రికా క్రికెట్ టీ20 ఛాలెంజ్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 48.83 సగటుతో 183.12 స్ట్రైయిక్ రేటుతో 293 పరుగులు చేసి అందర్నీ ఇంప్రెస్ చేశాడు ట్రిస్టన్ స్టబ్స్... ఇందులో 23 సిక్సర్లు కూడా ఉన్నాయి.

అయితే ఐపీఎల్‌లో మాత్రం ట్రిస్టన్ స్టబ్స్‌కి శుభారంభం దక్కలేదు. గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన తైమల్ మిల్స్ స్థానంలో రిప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు 21 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, రెండు బంతులాడి పరుగులేమీ చేయకుండానే ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

అలాగే 2017లో ఇంగ్లాండ్‌పై ఆఖరి టీ20 ఆడిన వేన్ పార్నెల్‌కి ఐదేళ్ల తర్వాత తిరిగి పిలుపు దక్కింది. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత 10 రోజుల వ్యవధిలో ప్రారంభం కాబోయే ఈ టీ20 సిరీస్‌లో భారత సీనియర్ ప్లేయర్లు ఎవ్వరూ పాల్గొనడం లేదని సమాచారం...

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ,కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ వంటి సీనియర్లు ఈ టీ20 సిరీస్‌కి దూరంగా ఉండబోతున్నారు. భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేదా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మోహ్సీన్ ఖాన్ వంటి కుర్రాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశం దక్కవచ్చని అంచనా. వీరితో పాటు ఇప్పటికే టీమిండియా ఆరంగ్రేటం చేసిన దీపక్ హుడా, ఆవేశ్ ఖాన్, టి నటరాజన్, కృనాల్ పాండ్యా, వంటి యువ ప్లేయర్లతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు... ఈ సిరీస్ ప్రదర్శన ద్వారా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టుపై ఓ అంచనాకి రానుంది బీసీసీఐ...