Australia Tour Of Sri Lanka: వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.  ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)  మూడు ఫార్మాట్లకు జట్టును ప్రకటించింది. జూన్ 7 న టీ20లతో మొదలయ్యే ఈ సిరీస్.. జులై 12 న టెస్టుతో ముగియనుంది.

ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇట్నుంచి ఇటే శ్రీలంక కు వెళ్లనున్నారు. లంకలో కంగారూలు మూడు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నారు. మూడు ఫార్మాట్లలో లంక పర్యటనకు వెళ్లనున్న జట్టును సీఏ శుక్రవారం ప్రకటించింది. అయితే టీ20, టెస్టు జట్టులలో సెలెక్టర్లు పలువురు ఆటగాళ్లకు ఊహించని షాకిచ్చారు. కొత్త పెండ్లి కొడుకు గ్లెన్ మ్యాక్స్వెల్ కు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అంతేగాక మార్కస్ హారిస్, పేసర్ మార్క్ స్టెకెటీకి సెలెక్టర్లు కరుణ చూపలేదు. జూన్ 7 న టీ20లతో మొదలయ్యే ఈ సిరీస్.. జులై 12 న టెస్టుతో ముగియనుంది. 

పాకిస్తాన్ తో ఇటీవలే ముగిసిన మూడు ఫార్మాట్ల సిరీస్ లో పెళ్లి కారణంగా విశ్రాంతి తీసుకన్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్. అయితే ఏదైనా ఒక ఫార్మాట్ కు అందుబాటులో ఉండాలని సెలెక్టర్లు కోరినా.. మ్యాక్సీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. లంకతో టూర్ లో అతడు టెస్టుల్లో ఆడాలని భావించాడు. కానీ సెలెక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. వన్డేలు, టీ20లకే పరిమితం చేశారు.

టెస్టు జట్టులో స్థానం దక్కకపోయినా మ్యాక్సీకి వన్డేలు, టీ20లలో అవకాశం దక్కింది. ఇక 16 మంది సభ్యులు గల టెస్టు జట్టులో ఓపెనర్ మార్కస్ హారిస్ కు ఈసారి కూడా ఓపెనర్లు మొండిచేయి చూపారు. 

పాకిస్తాన్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు తిరిగి జట్టుతో చేరారు. అయితే ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ ఆడమ్ జంపా లేకుండానే ఆసీస్ పర్యటనకు రానున్నది. తన భార్య గర్భవతి కావడంతో అతడు ఈ టూర్ కు అందుబాటులో ఉండటం లేదు. స్పిన్ కు సహకరించే పిచ్ లపై జంపా లేకపోవడం ఆసీస్ కు పెద్దలోటు. 

ఇక టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ కు టీ20 లో విశ్రాంతినిచ్చింది సెలెక్షన్ కమిటీ. ఐపీఎల్ లో అతడి తాజా వైఫల్యం కూడా ఇందుకు కారణం కావచ్చు. అతడు టెస్టులు, వన్డేలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. టెస్టులకు కమిన్స్ సారథి కాగా.. పరిమిత ఓవర్లకు ఆరోన్ ఫించ్ సారథ్యం వహిస్తాడు. ఫిబ్రవరిలో ఆసీస్ పర్యటనకు వెళ్లిన లంక.. అక్కడ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడి 1-4తో ఓడింది. దానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నది. 

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమెరూన్ గ్రీన్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ , మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్

వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా టీ20 జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అష్టన్ అగర్, జోష్ హెజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జే రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్, మాథ్యూ వేడ్ 

లంకలో ఆసీస్ పర్యటన ఇలా : 

- జూన్ 7 : తొలి టీ20 - కొలంబో
- జూన్ 8 : రెండో టీ20 - కొలంబో
- జూన్ 11 : మూడో టీ20 - క్యాండీ 
- జూన్ 14 : తొలి వన్డే - క్యాండీ 
- జూన్ 16 : రెండో వన్డే - క్యాండీ 
- జూన్ 19 : మూడో వన్డే - కొలంబో
- జూన్ 21 : నాలుగో వన్డే - కొలంబో
- జూన్ 24 : ఐదో వన్డే - కొలంబో
- జూన్ 29-జులై 3 - తొలి టెస్టు - గాలె 
- జులై 8-12 : రెండో టెస్టు - గాలె