కరోనా దెబ్బకు విశ్వక్రీడలతోసహా అన్ని క్రీడా టోర్నీలు వాయిదాపడడమో లేదా రద్దవడమో అవుతున్నాయి. ఐపీఎల్ పై సైతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దాదాపుగా ఈ సంవత్సరం ఐపీఎల్ ఉండనట్టే అనేది బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాటలను బట్టి అర్థమవుతున్న విషయం. 

క్రికెట్లో ఐపీఎల్ తరువాత ఇప్పుడీ జాబితాలోకి టీ20 వరల్డ్‌కప్‌ చేరిపోయింది. కరోనా ప్రభావంతో టి20 వరల్డ్‌కప్‌ అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో అక్టోబర్‌ 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ఈ మహమ్మారి మరింత మారణహౌమం సృష్టించకుండా నివారణ చర్యల్లో భాగంగా ప్రపంచం లాక్‌డౌన్‌లోకి వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో నలుగురు వ్యక్తులు ఒక చోటకు చేరటమే నిషేధం, ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాంటిది, క్రికెట్‌ మ్యాచ్‌కు వేలాది మంది స్టేడియానికి రావటం ఎంత పెద్ద ప్రమాదమో చెప్పనవసరం లేదు.

Also read: ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు: దాదా మాటల్లోని ఆంతర్యం అదేనా...? 

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. అక్టోబర్‌లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసుకుంది. రోజు రోజుకూ ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్‌ ఈ నెలాఖరులో ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌నే కాదు అక్టోబర్‌లో మొదలవ్వాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పైనా ప్రభావం చూపిస్తోంది. 

జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు. మరి వరల్డ్ కప్ ని ఎం చేస్తారు? పూర్తిగా  రద్ద్దు చేస్తారా? వాయిదా వేస్తారా అనేవి ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. 

టి20 ప్రపంచకప్ ఎప్పుడు....? 

రెండు దశల్లో జరుగనున్న టీ20 మెగా వార్‌కు క్రికెట్‌ ఆస్ట్రేలియా కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసుకుంది!. కరోనా వైరస్‌ బాధితుడు మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు హాజరు కావటం, కంగారూ గడ్డపై కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

ఈ పరిస్థితుల్లో అక్టోబర్‌లో అభిమానులు పూర్తి స్థాయిలో స్టేడియాలకు వస్తారనే విశ్వాసం ఎవరిలోనూ లేదు. 2020 టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించకుంటే, మరో షెడ్యూల్‌ సమయం ఆసీస్‌కు లేదు. 

అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, ఏడాది ఆఖర్లో భారత్‌తో బోర్డర్‌ గవాస్కర్‌ టెస్టు సిరీస్‌కు ఆసీస్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇక 2021లో భారత్‌ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌ జరుగనుంది(ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో ఇది జరగనుంది.) 

ఈ నేపథ్యంలో 2020 టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడితే, ఏ సమయంలో నిర్వహించాలనేది ప్రశ్నార్థకం. ఒకే ఏడాదిలో రెండు వరల్డ్‌కప్‌ల నిర్వహణ కష్టం కాబట్టి, 2020 టీ20 వరల్డ్‌కప్‌ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం లేకపోలేదు. 

ఐసీసీ క్యాలెండర్‌లో 2022 ఖాళీగా ఉంది. 2021లో టీ20 వరల్డ్‌కప్‌, 2023లో వన్డే వరల్డ్‌కప్‌లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులు నష్టపోకుండా చూడాలని భావిస్తే.. బీసీసీఐని ఐసీసీ ఒప్పించాల్సి ఉంటుంది. 

వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు ప్రపంచకప్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపితే మార్గం సుగమం కానుంది. 2021లో 2020 టీ20 వరల్డ్‌కప్‌, 2022లో 2021 టీ20 వరల్డ్‌కప్‌లను నిర్వహించే వెసులుబాటు ఐసీసీకి ఉంది. 

ఐతే, దీనికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి తప్పనిసరి. భారత బోర్డు గ్రీన్‌ సిగల్‌ ఇస్తే, రెండు టీ20 ప్రపంచకప్‌లు ఏడాది పాటు వాయిదా పడనున్నాయి అనేది తథ్యం.