ఐపీఎల్‌లో చెన్నై దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా‌ను తొలి నుంచి చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి నైట్‌రైడర్స్‌ను ఏ దశలోనూ పుంజుకోనివ్వలేదు.

ముఖ్యంగా దీపక్ చాహర్ ధాటికి కోల్‌కతా వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే లిన్‌, మూడో ఓవర్లో రాణా, ఐదో ఓవర్లో రాబిన్ ఉతప్పను పెవిలియన్ పంపిన చాహర్... తొలి మూడు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చాడు.

ఇతనికి హర్భజన్ కూడా జత కలిశాడు. జట్టు కష్టాల్లో ఉన్న దశలో ఆండ్రీ రసెల్ మరోసారి ఆపద్భాంధవుడు అయ్యాడు.  చివరి వరకు క్రీజులో నిలబడి అర్థసెంచరీ సాధించాడు. ఇతని ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు  చేసింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చెన్నైకి కూడా కోల్‌కతా కష్టాలే ఎదురయ్యాయి. పిచ్ ఏ మాత్రం సహకరించకపోవడంతో పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడింది. తొలుత వాట్సన్ 17, రైనా 14 దూకుడుగా ఆడినప్పటికీ వికెట్లు పొగొట్టుకున్నారు.

ఆ తర్వాత డుప్లెసిస్, రాయుడు జోడి నెమ్మదిగా స్కోరును పెంచే ప్రయత్నం చేసింది. రాయుడు 21 పరుగులు చేసి 15 ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్, డుప్లెసిస్ కోల్‌కతా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా వరుస బౌండరీలతో చెన్నైకి విజయాన్నందించారు.

17.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి సూపర్‌కింగ్స్ లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన చాహర్‌కు ‘‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’’ అవార్డ్ దక్కింది. అయితే పిచ్‌పై ఇరు జట్ల కెప్టెన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాము ఇలాంటి పిచ్‌లపై ఆడాలనుకోవట్లేదని... ఇక్కడ మరీ తక్కువ స్కోర్లు నమోదవుతున్నాయని ధోని అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇవాళ్టీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది.