సిడ్నీ టెస్టులో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. 205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... హజల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 272 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన భారత జట్టు... ఇంకా లక్ష్యాన్నికి 135 పరుగుల దూరంలో ఉంది. ఆఖరి రోజు ఇంకా 43 ఓవర్లు మిగిలి ఉండడంతో విజయం కోసం ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. 

రిషబ్ పంత్ అవుటైన తర్వాత స్పీడ్ పెంచిన పూజారా.. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. ఆ తర్వాత పేసర్ల బౌలింగ్‌లోనూ బౌండరీలు బాదుతూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేశాడు. మరోవైపు హనుమ విహారి మరోసారి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.

17 బంతుల తర్వాత తొలి పరుగు సాధించిన విహారి, 31 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే హనుమ విహారి బ్యాటుతో రాణించడం తప్పనిసరి. తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన రవీంద్ర జడేజా, అత్యవసరమైతే బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే జడ్డూ కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్‌ను బ్యాటింగ్‌కి పంపింది టీమిండియా.