ఐపీఎల్ 13 సీజన్ టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంటుందన్నారు ఆసీస్ మాజీ స్పీడ్ స్టార్ బ్రెట్ లీ. ఐపీఎల్ కవరేజ్‌లో భాగంగా బ్రాడ్‌కాస్టర్స్ హోట్స్‌గా వ్యవహరిస్తున్న బ్రెట్ లీ.. ప్రస్తుతం ముంబైకి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అభిమానులు  అడిగిన ప్రశ్నలకు లీ సమాధానం చెప్పాడు. ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎవరిని వరిస్తుందని ఒకరు అడిగిన ప్రశ్నకు సీఎస్‌కే అని జోస్యం చెప్పాడు లీ.

అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని పేర్కొన్నాడు. ఈ సారి ఫైనల్ 4లో కేకేఆర్ తప్పకుండా స్థానం సంపాదిస్తుందని వెల్లడించాడు. కాగా గతంలో కోల్‌కతా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల తరపున బ్రెట్ లీ ప్రాతినిథ్యం వహించాడు.

కాగా లీగ్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు చెన్నై యాజమాన్యం ప్రయత్నిస్తోంది. రైనా మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ధోనీ, హెడ్ కోచ్ ఫ్లెమింగ్ అతనిని మళ్లీ జట్టులోకి తీసుకునేందుకు అంత ఆసక్తిగా లేరు.

మరోవైపు వైస్ కెప్టెన్ రేసులో ముగ్గురు పేర్లు  వినిపిస్తున్నాయి. వీరిలో రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, డుప్లెసిస్ ఉన్నారు. వీరిలో జడేజా మినహా మిగిలిన ఇద్దరికి సారథ్య బాధ్యతలు నిర్వహించిన అనుభవం వుంది.