కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు.

భారత్ లో లాక్ డౌన్ 4లో కాస్త సడలింపులు ఇవ్వడంతో.. ప్రేక్షకులు లేకుండా క్రికెట్ కి అనుమతి లభించింది. దీంతో.. ఐపీఎల్ కి ముహుర్తం కుదిరినట్లేనని అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటి కే చాలా మంది ఐపీఎల్ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బార్డర్ మాత్రం అలా జరగవద్దని అన్నారు. ఒక డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్‌ కోసం అంతర్జాతీయ టోర్నమెంట్ రద్దు కావడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

‘‘ఒక స్థానిక టోర్నమెంట్ కంటే.. అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి టీ-20 ప్రపంచకప్ జరగకుంటే.. ఐపీఎల్ కూడా జరగవద్దు. కేవలం డబ్బుల కోసమే ఆలోచించడం మంచిది కాదు’’ అని బార్డర్ అన్నారు. 

అయితే ఒకవేళ ప్రపంచకప్ స్థానంలో ఐపీఎల్ జరిగితే.. అందుకు ఇండియానే కారణమని ఆయన తెలిపారు. ‘‘ఒకవేళ అదే జరిగితే.. పూర్తిగా ఇండియానే ఈ ఆటని నడిపిస్తుందని తెలుస్తుంది. అదే జరిగితే ఎవరూ కూడా ఐపీఎల్‌లో పాల్గొనవద్దు. అన్ని బోర్డులు తమ ఆటగాళ్లని ఐపీఎల్ ఆడేందుకు పంపించవద్దు’’ అని బార్డర్ తెలిపారు.