ENG vs NZ: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ కు అచ్చి రావడం లేదు.  వరుసగా రెండు టెస్టులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా గాయాల బారీన పడుతుండటం గమనార్హం.

కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టు ఏ ముహుర్తంలో ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిందో గానీ వాళ్లకు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే రెండు టెస్టులు వరుసగా ఓడి సిరీస్ కోల్పోయిన ఆ జట్టుకు తాజాగా మరో షాక్ తగిలింది. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా తయారైంది ఆ జట్టు పరిస్థితి. ఇప్పటికే తొలి టెస్టులో గాయపడి సిరీస్ నుంచి ఆల్ రౌండర్ కొలిన్ గ్రాండ్హోమ్ తప్పుకోగా.. తాజాగా ఆ జట్టు ఆల్ రౌండర్ కైల్ జెమీసన్, మైఖేల్ బ్రాస్వెల్ లు కూడా సిరీస్ కు దూరమయ్యారు. 

ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజు బౌలింగ్ చేస్తూ జెమీసన్ గాయపడ్డాడు. అతడి గాయాన్ని పరిశీలించిన వైద్యులు.. జెమీసన్ కు కనీసం ఐదారు వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు.

జెమీసన్ తో పాటు తొలి టెస్టులో గాయపడిన గ్రాండ్హోమ్ కు రిప్లేస్మెంట్ గా వచ్చిన మైఖేల్ బ్రాస్వెల్ కూడా మూడో టెస్టు ఆడటం అనుమానంగానే ఉంది. రెండో టెస్టు అనంతరం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలలో అతడికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అతడు వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నాడు. కొవిడ్ సోకడంతో జూన్ 23 నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్టులో అతడు ఆడటం అనుమానంగానే ఉంది. 

Scroll to load tweet…

రెండో టెస్టుకు కొన్ని గంటల ముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా కొవిడ్ భారీన పడ్డ విషయం తెలిసిందే. కొవిడ్ రావడంతో కేన్ మామ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడింకా ఐసోలేషన్ లోనే ఉన్నాడు. మరి మూడో టెస్టు ప్రారంభమయ్యేనాటికి కివీస్ కు ఇంకెన్ని షాకులు తగులుతాయో..? అని ఆ జట్టు అభిమానులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. 

ఇక సిరీస్ విషయానికొస్తే లార్డ్స్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన కివీస్.. ట్రెంట్ బ్రిడ్జిలో కూడా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసక్తికరంగా సాగిన ఈ టెస్టులో ఆఖరి రోజు ఇంగ్లాండ్ ముందు 300 పరుగుల లక్ష్యాన్ని కివీస్ నిలపగా.. జానీ బెయిర్ స్టో (92 బంతుల్లో 136.. 14 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఇంగ్లాండ్ కు రెండో టెస్టులో విజయంతో పాటు సిరీస్ ను కూడా సాధించిపెట్టాడు. బెన్ స్టోక్స్ (70 బంతుల్లో 75 నాటౌట్.. 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా ఓ చేయి వేసి ఇంగ్లాండ్ విజయలో కీలక పాత్ర పోషించాడు.

Scroll to load tweet…