Asianet News TeluguAsianet News Telugu

బెట్టింగ్ మాఫియా కనుసన్నల్లోనే ఐపీఎల్ 2019 ఫలితాలు .. పాక్ నుంచే సూచనలు, సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు

2019 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఫలితాలను పాకిస్తాన్ నుంచి అందిన సూచనలకు అనుగుణంగా బెట్టింగ్ మాఫియా ప్రభావితం చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 

Betting network influenced 2019 IPL results with inputs from Pakistan, says CBI
Author
New Delhi, First Published May 14, 2022, 5:46 PM IST

భారత్‌లో జరిగే ఐపీఎల్‌‌ (ipl) కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఎదురుచూస్తారో .. బెట్టింగ్ మాఫియా (betting mafia)  కూడా అదే స్థాయిలో వెయిట్ చేస్తూ వుంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (indian premier league) ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎన్నోసార్లు స్పాట్ ఫిక్సింగ్ (spot fixing) ఆరోపణలు వచ్చాయి. తాజాగా పాకిస్థాన్ (pakistan) నుంచి అందే సూచనల ఆధారంగా ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై సీబీఐ (cbi) దర్యాప్తు చేస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసే నెట్‌వర్క్ గురించి విశ్వసనీయ సమాచారం అందడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. ఈ నెట్‌వర్క్‌లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్ నగరాలకు చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నట్లుగా సీబీఐ వద్ద ఖచ్చితమైన సమాచారం వుంది. 

ఐపీఎల్ బెట్టింగ్‌లో పందెం కాసే విధంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ నేరాలతోపాటు అవినీతి నిరోధక చట్టం ప్రకారం శుక్రవారం రెండు కేసులను సీబీఐ నమోదు చేసింది. ఈ క్రమంలో ఓ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాన్ని ప్రభావితం చేసే క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తుల నెట్‌వర్క్ గురించి సీబీఐ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. పాకిస్థాన్ నుంచి అందే సూచనల ఆధారంగా ఈ నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తోంది. తద్వారా మ్యాచ్‌లపై పందెం కాసేలా చేయడానికి ప్రజలను ప్రలోభపెడుతోన్నట్లుగా సీబీఐ చెబుతోంది. 

ఈ బెట్టింగ్ లావాదేవీల కోసం ఈ ముఠా సభ్యులు  నకిలీ పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ క్రమంలో పలువురు బ్యాంకు అధికారులు కూడా ఈ ముఠాతో కుమ్మక్కైనట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. భారతీయుల నుంచి బెట్టింగ్ ద్వారా సంపాదించిన సొమ్ములో కొంత భాగం హవాలా మార్గాల ద్వారా విదేశాలకు తరలి వెళ్తోన్నట్లు తేల్చింది. నిందితులు పాకిస్థాన్‌లోని వకాస్ మాలిక్‌తో టచ్‌లో వుంటున్నట్లు గుర్తించారు. సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో వకాస్ ఫోన్ నెంబర్ సైతం లభించింది. 

ఈ ఎఫ్ఐఆర్‌లో దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసులను నిందితులుగా సీబీఐ పేర్కొంది. ఈ నెట్‌వర్క్ 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. నిందితుల బ్యాంకు ఖాతా ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు సీబీఐ వెల్లడించింది. రెండో ఎఫ్ఐఆర్‌లో సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులను నిందితులుగా పేర్కొంది. వీరు 2010 నుంచి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీరు జరిపిన లావాదేవీల విలువ రూ.1 కోటి మేరకు ఉంటుందని వెల్లడించింది. దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు 43 లక్షలకు పైగా నిధులు వున్నట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios