INDvsAUS 2nd Test: భారత  క్రికెట్ జట్టుకు టెస్టులలో వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ ఆట నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆడకున్నా  అతడు వరుసగా అవకాశాలు దక్కించుకుంటుండంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  

టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ కెఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా అత్యంత చెత్త ఆటతో కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా అతి బలవంతంగా చేస్తున్న రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగ్‌పూర్ టెస్టులో విషలమైన రాహుల్.. ఢిల్లీ టెస్టులో కూడా అత్యంత చెత్త ఆటతో పరువు తీసుకున్నాడు. అయితే రాహుల్ వైఫల్యాలను ఏకరువు పెడుతూ నిన్న (శనివారం) టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్ లో వరుస ట్వీట్స్ తో మండిపడ్డాడు. 

ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మామూలుగానే రాహుల్ ను ఆటాడుకునే నెటిజన్లకు వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టు మారాయి. కాగా ముప్పేట విమర్శల దాడి నేపథ్యంలో రాహుల్ కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మద్దతుగా నిలిచాడు.

ఆకాశ్ చోప్రా ట్విటర్ లో ‘‘వెంకీ భాయ్. టెస్టు మ్యాచ్ నడుస్తోంది. రెండు ఇన్నింగ్స్ ముగిసేవరకైనా ఓపిక పట్టకపోయావా.. ఏదేమైనా మనమంతా ఒకటి. టీమిండియా. నువ్వు చేసిన విమర్శలు వెనక్కి తీసుకో అని నేను చెప్పడం లేదు. కానీ టైమింగ్ ఇంపార్టెంట్ కదన్నా. అసలు మన గేమ్ అంటేనే ‘టైమింగ్’తో కూడుకున్నది..’’ అని ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ కు వెంకటేశ్ ప్రసాద్ కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఆకాశ్ ట్వీట్ కు బదులిస్తూ.. ‘నిజంగా చెప్పాలంటే నేను చేసింది కరక్టేఅని నమ్ముతున్నా ఆకాశ్. నా దృష్టిలో రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసినా ఇదే రకంగా విమర్శిస్తా. నా వ్యాఖ్యాలను నేను సమర్థించుకుంటున్నా. మ్యాచ్ కు ముందు విమర్శించానా.., జరుగుతున్నప్పుడా.. అయిపోయాక అనేది కాదు విషయం. నీకు ఓ విషయం చెప్పదలుచుకున్నా. యూట్యూబ్ లో నీ వీడియోలు బాగుంటున్నాయి. నేను వాటిని చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నా..’అని మళ్లీ చోప్రా మారు మాట్లాడకుండా బదులిచ్చాడు. 

Scroll to load tweet…

శనివారం రాహుల్ పై ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఈ వైఫల్యం కొనసాగుతోంది. టీమిండియా మేనేజ్మెంట్ లోపాలను ఇది చూపుతోంది. నాకు తెలిసి గడిచిన 20 ఏండ్లలో భారత క్రికెట్ లో ఇంత తక్కువ సగటుతో ఏ ఆటగాడు ఇన్ని టెస్టులూ ఆడలేదు. టీమ్ లో అతడిని చేర్చడం అంటే న్యాయాన్ని సమాధి చేస్తున్నట్టే ఉంది. టీమిండియా మాజీ ఓపెనర్లు శివ సుందర్ దాస్, శఠగోపన్ రమేశ్ లు గొప్ప సామర్థ్యమున్నా.. వాళ్ల సగటు 38 ప్లస్ గా ఉన్న వారు 23 టెస్టులకే పరిమితమయ్యారు. రాహుల్ కు వరుసగా అవకాశాలివ్వడం చూస్తే భారత్ లో బ్యాటర్లు లేరని చెప్పకనే చెప్పినట్టుగా అర్థమవుతున్నది. గత ఐదేండ్లుగా రాహుల్ 47 ఇన్నింగ్స్ లలో 27 సగటుతో దారుణంగా ఆడుతున్నాడు.... 

కెఎల్ కు ఇచ్చినన్ని అవకాశాలు మరే ఆటగాడికీ ఇవ్వలేదు. ఇది తీవ్రమైన వివక్ష. కెఎల్ రాహుల్ మంచి ఆటగాడే కావొచ్చు గానీ చాలాకాలంగా అతడి ప్రదర్శనలు నాసిరకంగా ఉన్నాయి. ఇప్పుడు గనక అతడు మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే రెండేండ్ల దాకా ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా గడిపేయొచ్చు. టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లు టాలెంటెడ్ ఆటగాళ్లకు ఛాన్సులివ్వకుండా రాహుల్ వంటి పేలవ ఫామ్ తో ఉన్న ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిస్తున్నారు. శిఖర్ ధావన్ కు టెస్టులలో 40 ప్లస్ సగటు ఉంది. మయాంక్ సగటు 41 ప్లస్. టెస్టులలో అతడు రెండు డబుల్ సెంచరీలు కూడా చేశాడు. శుభ్‌మన్ గిల్ జబర్దస్త్ ఫామ్ లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..? చాలామంది దేశవాళీ ఆటగాళ్లు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నిలకడగా రాణిస్తూ అదరగొడుతున్నా సెలక్టర్లు వారిని పట్టించుకోవడం లేదు....’అని ఫైర్ అయ్యాడు.