Asianet News TeluguAsianet News Telugu

Ben Stokes: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ గా స్టోక్స్.. అప్పుడే చెప్పిన ధోని..

England Test Captain Ben Stokes: ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టుకు బెన్ స్టోక్స్ ను సారథిగా ప్రకటిస్తూ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తాజాగా ప్రకటన చేసింది. రూట్ స్థానాన్ని భర్తీ చేస్తున్న స్టోక్స్ ఇంగ్లాండ్ కు 81వ సారథి. 

Ben Stokes Named England Men's Test Captain, Confirms ECB
Author
India, First Published Apr 28, 2022, 4:02 PM IST | Last Updated Apr 28, 2022, 4:02 PM IST

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు ఊపిరులూదడానికి వాళ్లకు కొత్త సారథి దొరికాడు.  ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఈసీబీ.. ఇంగ్లాండ్ టెస్ట్  కెప్టెన్ గా నియమించింది.  ఈ మేరకు  ఈసీబీ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.  వరుస సిరీస్ వైఫల్యాల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న  జో రూట్.. ఇక జట్టులో  సీనియర్ ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు.  ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. స్టోక్స్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పేందుకు కృషి చేశారు.  ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టుకు బెన్ స్టోక్స్ 81వ సారథి.  

స్టోక్స్  నియామకంపై రాబ్ కీ మాట్లాడుతూ.. ‘ఈ బాధ్యతలను మోసేందుకు అంగీకరించిన బెన్ స్టోక్స్ కు కృతజ్ఞతలు.  రెడ్ బాల్ క్రికెట్ (టెస్ట్) లో ఇంగ్లాండ్ ను మరో స్థాయికి తీసుకెళ్లే ఆటగాడు అతడు. మా  అభ్యర్థనకు అంగీకారం తెలిపినందుకు నేను సంతోషిస్తున్నాను. కెప్టెన్ పదవికి అతడు పూర్తిగా అర్హుడు..’ అని తెలిపాడు 

ఇదే విషయమై ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ స్పందిస్తూ.. ‘ఇంగ్లాండ్ కు ప్రాతినిథ్యం వహించడమంటే అతడికి చాలా ఇష్టం.  బెన్ మమ్మల్ని (ఇంగ్లాండ్) మరింత ఉన్నత స్థానంలో నిలబెడతాడు.  అతడు సవాళ్లను స్వీకరించడంలో ముందుంటాడు..’ అని  చెప్పాడు. 

 

కాగా బెన్ తో పాటు యాషెస్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ జట్టును వీడిన హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్ స్థానాన్ని గ్యారీ కిర్స్టెన్ తో భర్తీ చేయనున్నాడు. జూన్ 10 తర్వాత కిర్స్టెన్.. ఇంగ్లాండ్ జట్టుతో చేరతాడు.  

30 ఏండ్ల స్టోక్స్.. ఇంగ్లాండ్ తరఫున ఇప్పటికే 79 టెస్టులాడాడు. 35.89 సగటుతో 5,061 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలర్ గా కూడా సత్తాచాటిన రూట్.. 174 వికెట్లు సాధించాడు. ఇక 101 వన్డేలలో 2,871 పరుగులు చేసి 74 వికెట్లు తీశాడు. గతంలో స్టోక్స్ ఇంగ్లాండ్ కు మూడు వన్డేలలో కెప్టెన్ గా వ్యవహరించాడు. మూడింట్లో ఇంగ్లాండ్ గెలిచింది. ఒక టెస్టుకు కూడా కెప్టెన్ గా ఉన్నాడు. అది డ్రాగా ముగిసింది. 

 

ధోని మాటలు నిజమైన వేళ.. 

స్టోక్స్  సారథిగా నియమితుడయ్యాక  ధోని అభిమానులు గతంలో  అతడు.. స్టోక్స్ గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన  విషయాలను గుర్తు చేసుకున్నార. 2017లో ఈ ఇద్దరూ ఐపీఎల్ లో రైజింగ్ పూణే సూపర్ జెయిట్స్ తరఫున ఆడారు. అప్పుడు ధోని స్టోక్స్ గురించి మాట్లాడుతూ.. ‘అతడు మీకు ఇప్పుడు గొప్ప ఆటగాడిగా కనిపించలేకపోవచ్చు. కానీ పదేండ్ల తర్వాత  అతడు గ్రేట్ ప్లేయర్ గా మాత్రమే కాదు అతడి దేశానికి కూడా సారథ్యం వహిస్తాడు. నేను అతడిలో సారథిని చూశాను..’ అని చెప్పాడు. పదేండ్లు కూడా పట్టకుండానే స్టోక్స్ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios