Happy Birthday Dada: టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ నేడు తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రెండ్రోజుల క్రితమే ముంబైలో పార్టీ చేసుకుంటూ కనిపించిన దాదా.. ఇప్పుడు లండన్ లో ప్రత్యక్షమయ్యాడు.
నేడు (జులై 8) 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను లండన్ లో చేసుకుంటున్నాడు. బుధవారం ముంబైలోనే కనిపించిన దాదా.. గురువారం రాత్రి లండన్ కు వెళ్లడం.. అక్కడ తన భార్య డోనా కూతురు సనా తో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. గురువారం రాత్రి లండన్ లో భార్యా కూతురుతో పాటు మరికొద్దిమంది మిత్రులతో దాదా బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేశాడు.
లండన్ లోని ఓ రోడ్డులో గురువారం రాత్రి డోనా, సనాతో పాటు ఇతర మిత్రుల సమక్షంలో దాదా.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నటించిన ఓంశాంతి ఓం సినిమాలోని టైటిల్ పాటతో పాటు వరుణ్ ధావన్ నటించిన బేషర్మికి హైట్ సినిమాలోని ‘తేరే నామ్’ పాటలకు కాలు కదిపాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో గంగూలీ.. ఓం శాంతి ఓం పాటకు డాన్స్ చేస్తుండగా తన కూతురు కింద కూర్చుంటే.. తనను తీసుకుపోయి ఆమెతో కలిసి డాన్స్ చేశాడు. ఇక పక్కనే ఉన్న డోనాతో కలిసి కూడా కాలు కదిపాడు ఈ కోల్కతా ప్రిన్స్.
గంగూలీ పుట్టినరోజును పురస్కరించుకుని అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అతడి సహచర క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్ లు దాదాకు ట్విటర్ వేదికగా గ్రీటింగ్స్ చెప్పారు. ఈ సందర్భంగా యువీ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే దాదా. నువ్వు గొప్ప మిత్రుడివి. ప్రభావితం చేసే సారథివి. నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి జూనియర్ క్రికెటర్ కు సీనియర్ వి..’ అని ట్వీట్ చేశాడు. భజ్జీ స్పందిస్తూ.. ‘గ్రేట్ ప్లేయర్, సూపర్బ్ లీడర్. బీసీసీఐ ప్రెసిడెంట్, నా కెప్టెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే దాదా..’ అని గంగూలీతో కలిసున్న ఫోటోను షేర్ చేశాడు. ఐపీఎల్ లోని ఫ్రాంచైజీలు, భారత క్రికెట్ అభిమానులు దాదాకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
