టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విబేధాలు... గతకొంత కాలంగా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన టాపిక్. అయితే ఇందులోని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కొన్ని మీడియా సంస్థలు ఈ ప్రచారాన్ని మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే వెస్టిండిస్ పర్యటనకు ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ...రోహిత్ తో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్ఫష్టం చేశాడు. అయినప్పటికి ఈ ప్రచారానికి బ్రేకులు పడలేదు. దీంతో బిసిసిఐ మరోసారి ఈ తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కోహ్లీ, రోహిత్ లకు సంబంధించిన ఓ సరదా వీడియోను అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది. 

బిసిసిఐ పోస్ట్ చేసిన వీడియోలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సరదాగా హెడ్స్ అప్ చాలెంజ్ ఆడుతూ కనిపించారు. అంటే జడేజా తమ సహచర ఆటగాళ్లను ఇమిటేట్ చేస్తే రోహిత్ గుర్తించాలన్నమాట. ఇలా మొదట బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను ఇమిటేట్ చేయగా రోహిత్ చాలా సులభంగా గుర్తుపట్టాడు. ఆ తర్వాత కోహ్లీ బంతిని ఎదుర్కొనే ముందు క్రీజులో ఎలా వుంటాడో జడేజా నటించి చూపించాడు. ఆ యాక్షన్ ను కూడా రోహిత్ కరెక్ట్ గా గుర్తుపట్టాడు.  

అయితే వీరిద్దరి మధ్య ఈ ఛాలెంజ్ జరుగుతున్నపుడు కోహ్లీ అక్కడే వున్నాడు. తన యాక్షన్ ను రోహిత్ ఎలా గుర్తుపట్టాడంటూ జడేజాను అడిగి మరీ మరోసారి అలా యాక్ట్ చేయించాడు.దీంతో ముగ్గురు పగలబడి నవ్వుకున్నారు. ఇలా ఈ  ముగ్గురి మధ్య జరిగిన సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియోను బిసిసిఐ పోస్ట్ చేసింది. 

దీన్ని బిసిసిఐ సరదాగానే పోస్ట్ చేసిన అభిమానులకు మాత్రం ఓ విషయంలో క్లారిటీ వచ్చింది. కోహ్లీ, రోహిత్ ల మధ్య ఎలాంటి విబేధాలు లేవని...ఇదంతా సోషల్ మీడియా, మీడియా సృష్టేనన్న విషయం  అర్థమయ్యింది.  ఈ వీడియోను చూసిన తర్వాతయినా కోహ్లీ, రోహిత్ ల మధ్య విబేధాలున్నాయన్న తప్పుడు ప్రచారం ఆగుతుందని భావిస్తున్నామని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.