Sourav Ganguly imitates Allu Arjun: పుష్ప సినిమా విడుదలై నాలుగు నెలలు దాటింది. ఆ సినిమా ఓటీటీలో కూడా సందడి చేసింది. రోజులు గడుస్తున్నా ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు, డాన్స్ స్టెప్పులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని ఉర్రూతలూగించిన పుష్ప సినిమా విడుదలై నాలుగు నెలలు గడిచింది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగులు, అల్లు అర్జున్ హావభావాలు, ‘తగ్గేదేలే ’ డైలాగ్, శ్రీవల్లి స్టెప్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. భారత క్రికెటర్లతో పాటు ప్రపంచ క్రికెటర్లు చాలా మంది ఈ స్టెప్పులను వేసి వారి అభిమానులను అలరించారు. ఇప్పుడు తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కూడా పుష్ప ఫీవర్ తాకింది.
బెంగాళీలో దాదా హోస్ట్ గా వస్తున్న ‘దాదాగిరి అన్లిమిటెడ్’ షో లో గంగూలీ పుష్ప స్టెప్పులను వేశాడు. జీ బంగ్లాలో ప్రసారమవుతున్న (వెస్ట్ బెంగాల్) ఈ షో లో చిన్న పిల్లలతో కలిసి దాదా షో చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీ విడుదల చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. గంగూలీ ఓ అబ్బాయిని నీ పేరేమిటి అని అడగగా అతడు ‘పుష్ప’ అని సమాధానమిచ్చాడు. అనంతరం ‘చూపే బంగారమాయేనే’ పాటకు ఆ బుడ్డోడు స్టెప్పులేయడమే గాక గంగూలీతో కూడా వేయించాడు. ఈ సందర్భంగా గంగూలీ... ‘తగ్గేదేలే’ ను కూడా ఇమిటేట్ చేశాడు.
గతంలో రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా, డ్వేన్ బ్రావో, షకిబ్ ఉల్ హసన్ వంటి ఆటగాళ్లెందరో పుష్ప సినిమాలోని డైలాగులు, స్టెప్పులకు డాన్సులు వేసిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా శనివారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న ఐపీఎల్-15 సీజన్ సన్నాహకాల్లో గంగూలీ తలమునకలై ఉన్నాడు. ఈనెల 26న చెన్నై సూపర్ కింగ్స్- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగబోయే మ్యాచుకు అతడు హాజరయ్యే అవకాశముంది. ప్రతిష్టాత్మక వాంఖెడే ప్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సీజన్ లో మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించడానికి గాను స్టేడియంలో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. ఇప్పటికే టికెట్ల విక్రయాన్ని కూడా ప్రారంభించింది. మహారాష్ట్ర వేదికగా జరుగుబోయే ఈ మ్యాచులు.. వాంఖెడే, బ్రబోర్న్, డీవై పాటిల్ తో పాటు పూణెలోని ఎంసీఎ గ్రౌండ్ లో జరుగుతాయి. కొవిడ్ - 19 నిబంధనలను పాటిస్తూ బయో బబుల్ లో నిర్వహిస్తున్న ఈ మ్యాచులను వీక్షించడానికి వచ్చే అభిమానులు రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుని ఉండాలని బీసీసీఐ ఇదివరకే తెలిపిన విషయం తెలిసిందే.
