సారాంశం

ఐసీపీ వన్డే వరల్డ్ కప్ 2023 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి భారత జట్టను నేడు బీసీసీఐ ప్రకటించింది.

ICC ODI World Cup 2023: ఐసీపీ వన్డే వరల్డ్ కప్ 2023 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి భారత జట్టను నేడు బీసీసీఐ ప్రకటించింది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసింది. జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించారు. 

ఆసియా కప్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు‌లో అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లు.. ఇప్పుడు  వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియాలో కేఎల్ రాహుల్‌కు చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు కూడా గాయాల కారణంగా గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక, హైదరాబాద్ కుర్రాడు తిలక్‌ వర్మ, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌లకు మాత్రం నిరాశే మిగిలింది. గత నెలలో వెస్టిండీస్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన చేసిన నేపథ్యంలో.. ఆసియా కప్ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే వరల్డ్ కప్ జట్టులో మాత్రం అతనికి చోటు దక్కలేదు. 

 

 

ఇక, అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే వరల్డ్ కప్‌ జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై వేదికగా నిలవనుంది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్..  2015, 2019 ఎడిషన్‌లలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మరోసారి స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతుండటంతో టీమిండియాపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇక,స్క్వాడ్‌లను ఖరారు చేయడానికి గడువు అయిన సెప్టెంబర్ 28 వరకు వరల్డ్ కప్‌లో పాల్గొనే అన్ని జట్లు అప్పటివరకు టీమ్స్‌లో తమకు నచ్చినన్ని మార్పులు చేసుకునేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చింది.