ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో భారత్ దారుణ పరాజయం బీసీసీఐ గట్టి ప్రభావాన్ని చూపుతోంది. జట్టు ఓటమికి సెలక్షన్ కమిటీ నిర్ణయాలే ప్రధాన కారణమని బీసీసీఐ ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రధానంగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై పెద్దలు గుర్రుగా ఉన్నారని సమాచారం. ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి కీలకమైన నాలుగో నంబర్ ఆటగాడిని ఎంపిక చేయడంలో విఫలమయ్యారని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.

ప్రపంచకప్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమైన వెంటనే... ఓపెనర్ రాహుల్‌ని రోహిత్‌కు జోడీగా ఎంపిక చేయడంతో పాటు ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్‌ని నాలుగో స్థానంలో ఆడించారు.

అనంతరం విజయ్‌కి గాయమైతే టెస్ట్ క్రికెటర్.. అప్పటికీ వన్డేల్లో అరంగేట్రం చేయని మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేశారు. కీలకమైన స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయడంలో సెలక్షన్ కమిటీ సభ్యులు విఫలమయ్యారని బీసీసీఐ అధికారులు ఆగ్రహంతో ఉన్నారు.

జట్టు ఏదైనా సిరీస్ లేదా టోర్నీ గెలిస్తే ఆర్ధిక రివార్డు పొందే సెలక్టర్లు.. ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత తీసుకోవాలని ఓ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్‌కు తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచి టోర్నీలో ఆటగాళ్ల మార్పుచేర్పుల వరకు సెలక్షన్ కమిటీ సభ్యులే అన్ని నిర్ణయాలు వాళ్లే తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.