రికార్డులు వున్నది తిరగరాయడానికే అన్నట్లు క్రికెట్‌లో ఎన్నో రికార్డుల్ని ఎవరు బద్ధలు కొట్టలేరని చాలా మంది భావించారు. కానీ ప్రతిభావంతులైన ఆటగాళ్లు వాటిని తిరగరాసి.. కొత్త లక్ష్యాలను నిర్దేశించారు

రికార్డులు వున్నది తిరగరాయడానికే అన్నట్లు క్రికెట్‌లో ఎన్నో రికార్డుల్ని ఎవరు బద్ధలు కొట్టలేరని చాలా మంది భావించారు. కానీ ప్రతిభావంతులైన ఆటగాళ్లు వాటిని తిరగరాసి.. కొత్త లక్ష్యాలను నిర్దేశించారు. ఇకపోతే క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం సాధ్యమవుతుందా అని భావించిన వాళ్లకి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పారు.

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాత చాలా మంది ఈ ఫీట్‌ను సాధించారు. హర్షలే గిబ్స్‌, తిసార పెరీరా, కీరన్‌ పొలార్డ్‌‌లు కూడా ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదారు. 

Also Read:రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు కాదు, అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం... పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్

తాజాగా ఈ ఫీట్ మరోసారి రిపీట్ అయ్యింది. యూరోపియన్‌ క్రికెట్‌ డొమెస్టిక్‌ లీగ్‌లో... భాగంగా ఈసీఎస్‌ టీ10 పేరిట జరుగుతున్న టోర్నీలో శుక్రవారం బేయర్‌ ఉర్డింజిన్‌ బూస్టర్స్‌ , కోన్‌ చాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. బేయర్‌ ఉర్డింజిన్‌ బ్యాట్స్‌మన్‌ అరితరన్‌ వసీకరణ్‌ ఆయుష్‌ శర్మ బౌలింగ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 

ఆయుష్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్‌లో వసీకరణ్ ఆరు బంతులను వరుసగా.. మిడ్‌ వికెట్‌, మిడ్‌ వికెట్‌,స్క్వేర్‌లెగ్‌, మిడ్‌ వికెట్‌, స్క్వేర్‌లెగ్‌, మిడాన్‌ దిశగా ఆరు సిక్సుల బాదాడు. అతను క్రీజులోకి వచ్చేసరికి జట్టు స్కోరు 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 21 పరుగులతో ఉంది.

అతని సిక్సర్ల దెబ్బకు 5 ఓవర్లలో 57/3గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో వసీకరణ్‌ 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్స్‌లు.. మూడు బౌండరీలు ఉన్నాయి. మొత్తంగా బూస్టర్స్‌ 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.