ఢాకా: భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందా, లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. తమ డిమాండ్లపై బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో భారత్ బంగ్లాదేశ్ పర్యటనపై నీలినీడలు అలుముకున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఆటగాళ్లు ఏ విధమైన క్రికెట్ కార్యక్రమాల్లో పాలు పంచుకోబోరని బంగ్లాదేశ్ టెస్ట్, టీ20 జట్ల కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రకటించాడు.

షకీబ్ అల్ హసన్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తమ దేశం క్రికెట్ బోర్డు తమ 11 పాయింట్ల డిమాండును అంగీకరించకపోతే క్రికెట్ క్రీడకు తమ ఆటగాళ్లు దూరంగా ఉంటారని ఆయన చెప్పాడు. నవంబర్ 3వ తేదీ నుంచి బంగ్లాదేశ్ జట్టు భారతదేశంలో క్రికెట్ ఆడాల్సి ఉంది. 

షెడ్యూల్ ప్రకారం మూడు మ్యాచుల ట్వంటీ20 సిరీస్, రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ను బంగ్లాదేశ్ టీమిండియాతో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ క్రికెటర్లు తీసుకున్న నిర్ణయంతో ఈ సిరీస్ లు జరుగుతాయా, లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కూడా తుది 11 మంది ఆటగాళ్లలో ఒక లెగ్ స్పిన్నర్ విధిగా ఉండాలనే నిబంధనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విధించింది. నిబంధనను పాటించలేదని చెప్పి బీసీబీ రెండు జట్ల హెడ్ కోచ్ లను సస్పెండ్ చేసింది. 

ఈ కొత్త నిబంధన ఆటగాళ్లను అణచివేస్తుందని షకీబ్ అల్ హసన్ ఆదివారంనాడు అన్నాడు. చాలా ఏళ్లుగా సీనియర్ జట్టులోకి లెగ్ స్పిన్నర్ ను తీసుకోలేదని, అకస్మాత్తుగా బీపీఎల్ లోకి ఏడుగురు లెగ్ స్పిన్నర్లను తీసుకోవాలనే నిబంధన పెట్టారని, ఈ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. 

విశ్వాసం పొందడానికి, నిలకడగా రాణించడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో లెగ్ స్పిన్నర్లు చాలా ఓవర్లు వేయాల్సి ఉంటుందని తాను అనుకుంటున్నానని, బీపీఎల్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పోటీ టోర్నమెంట్ అని, ఇందులో సీనియర్ ఆటగాళ్లను ఎగుర్కోవాల్సి ఉంటుందని, విదేశీ ఆటగాళ్లతో డ్రెసింగ్ రూమ్ పంచుకోవాల్సి ఉంటుందని, అది ఆటగాళ్లను తయారు చేసే స్థలం కాదని అన్నారు.