వెస్టీండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ కి చేదు అనుభవం ఎదురైంది. ఎమిరేట్స్ విమానం ఎక్కేందుకు వెళ్లిన ఆయనను విమాన సిబ్బంది అడ్డుకున్నారు. ఆయనను విమానం ఎక్కనివ్వకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని క్రిస్ గేల్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు.

కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ విమానంలో ఎక్కడానికి అనుమతించనందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌పై క్రిస్ గేల్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డాడు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ తనతో ప్రవర్తించిన తీరుకు తాను నిరాశ చెందానని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డాడు. 

‘ఎమిరేట్స్ నా పట్ల ప్రవర్తించిన తీరుకు నిరాశ చెందాను. నా వద్ద టికెట్ ఉన్నప్పటికీ... విమానంలో ఖాళీ లేదని చెప్పారు. వాట్ ద ఎఫ్... నేను బిజినెస్ క్లాస్ బుక్ చేసుకుంటే ఎకానమీ క్లాస్ లో ప్రయాణించమన్నారు. దీంతో నేను ఆ తర్వాతి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఎమిరేట్స్ తో చేదు అనుభవం’ అంటూ గేల్ ట్వీట్ చేశాడు.

క్రిస్ గేల్ ట్వీట్‌కు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ సైతం ట్విట్టర్‌లో స్పందించడం విశేషం. తన ట్విట్టర్‌లో "మమ్మల్ని క్షమించండి, క్రిస్. దయచేసి మీ బుకింగ్ రిఫరెన్స్ మరియు ఇమెయిల్ చిరునామాను మాకు DMకు తెలియజేయండి. ఆప్షన్స్‌ను చెక్ చేసి మీకు తెలియజేస్తాము" అని ట్వీట్ చేసింది.

క్రిస్ గేల్ చివరిసారిగా ఈ ఏడాది ఆగస్టులో భారత్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో కనిపించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించడంతో వెస్టిండిస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది