PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా పెషావర్ జల్మీ సారథి బాబర్ ఆజమ్ మరోసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లలో వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు.
ఆట కంటే పాత్రికేయుల సమావేశాలలో జర్నలిస్టులపై కోపంగా చూడటం, వారికి తలతిక్క సమాధానాలివ్వడం ద్వారా వార్తలలో నిలిచే పాకిస్దాన్ సారథి బాబర్ ఆజమ్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈసారి అతడు టీమిండియా సారథి రోహిత్ శర్మను కాపీ కొట్టాడు. తన మాజీ ఫ్రాంచైజీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ బాబర్... ‘నేనేమన్న ఆ టీమ్ కు కోచ్ నా..?’ అని ప్రశ్నించాడు.
వివరాల్లోకెళ్తే.. పీఎస్ఎల్ లో భాగంగా పెషావర్ జల్మీ తరఫున సారథిగా వ్యవహరిస్తున్న బాబర్ రెండ్రోజుల క్రితం ఇస్లామాబాద్ తో మ్యాచ్ ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఓ జర్నలిస్టు.. బాబర్ మాజీ ఫ్రాంచైజీ (కరాచీ కింగ్స్) గురించి అడిగాడు.
ఈ సీజన్ లో కరాచీ.. ఐదు మ్యాచ్ లు ఆడి ఒకదాంట్లోనే గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడింది. గత సీజన్ తో పాటు ఈ సీజన్ లో కూడా ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ జట్టును చూస్తే మీకు ఏమనిపిస్తుంది..? అని అడిగాడు. దానికి బాబర్ స్పందిస్తూ.. ‘నేనేమైనా వాళ్ల (కరాచీ) కోచ్ నా..? మీరు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం...’అని చెప్పాడు. బాబర్ ఇలా చెప్పడంతో అక్కడ అందరూ ఘొల్లున నవ్వారు.
కాగా బాబర్ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో దీనిపై టీమిండియా ఫ్యాన్స్ మరో విధంగా స్పందిస్తున్నారు. బాబర్.. రోహిత్ శర్మను కాపీ కొట్టాడని అంటున్నారు. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో పాత్రికేయుల సమావేశంలో రోహిత్ కు ఓ జర్నలిస్టు.. ‘పాకిస్తాన్ బ్యాటర్లు ఈ సంక్షోభం నుంచి బయటపడటం ఎలా..?’అని అడిగాడు. దానికి రోహిత్ స్పందిస్తూ... ‘నేను పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్ అయిన తర్వాత అప్పుడు నేను కచ్చితంగా నీకు సమాధానం చెబుతా..’అని చెప్పాడు. తాజాగా బాబర్ కూడా ఇదే విధంగా ఆన్సర్ ఇవ్వడం గమనార్హం.
కాగా పీఎస్ఎల్ లో పెషావర్ జల్మీ ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ సీజన్ లో పెషావర్.. నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలో గెలిచి రెండింటిలో ఓడింది. కరాచీ ఐదు మ్యాచ్ లలో ఒకదాంట్లోనే గెలిచి నాలుగింటిలో ఓడింది. ముల్తాన్ సుల్తాన్స్.. ఐదు మ్యాచ్ లలో నాలుగు గెలిచి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇస్లామాబాద్.. డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ కలాండర్స్ ఉన్నాయి.
