Alex Carey Falls Into Swimming Pool: ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ తోటి సహచరులతో కలిసి మాటల్లో మునిగి మైమరిచిపోయి నడుస్తూ కాలు జారాడు. తన పక్కన ఏముందో కూడా చూసుకోనంతగా...
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ కాలు జారాడు. 24 ఏండ్ల తర్వాత పాక్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా.. తొలి టెస్టులో పేలవమైన డ్రా తో ముగించిన అనంతరం హోటల్ లో సేద తీరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆసీస్ జట్టు ఆటగాళ్లంతా రిలాక్స్ అవుతున్న వేళ.. అటుగా మాట్లాడుకుంటూ వెళ్తున్న కేరీ.. కాలుజారి అందులో పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏకంగా కంగారూల జట్టు సారథి పాట్ కమిన్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
రావల్పిండిలో జరిగిన తొలి టెస్టు ఫలితం తేలలేదు. ఐదు రోజులు ఆడినా రావల్పిండి టెస్టు మాత్రం పేలవమైన డ్రా గా ముగిసింది. దీంతో పాక్ లో ఠారెత్తిస్తున్న ఎండలకు అలిసిపోయిన ఆసీస్ ఆటగాళ్లు.. తాము బస చేస్తున్న హోటల్ లో సేదతీరారు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర అంతా పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.
ఈ క్రమంలో భుజాలకు బ్యాగ్ తగిలించుకుని స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఉన్న తన సహచరులతో మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చిన అలెక్స్ కేరీ.. ఉన్నట్టుండి చూసుకోకుండా స్విమ్మింగ్ పూల్ లోకి పడిపోయాడు. ఇది చూసిన అతడి ఆసీస్ సహచరులు పగలబడి నవ్వారు. నీళ్లలో పడ్డ తర్వాత తన తోటి ఆటగాళ్లంతా గేలి చేస్తున్నట్టు నవ్వడంతో కాస్త సిగ్గు పడ్డాడో ఏమో గానీ.. కేరీ కూడా తన తప్పును తెలుసుకుని దానిని ముఖంలో కనిపించకుండా పైకి నవ్వినట్టు యాక్ట్ చేశాడు.
నీళ్లలో ఉండగానే.. తన షార్ట్ జేబులో తడుస్తున్న ఫోన్ ను.. స్విమ్మింగ్ పూల్ పైన ఉన్న సహచరులకు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాట్ కమిన్స్ ఇన్స్టాలో పోస్టు చేశాడు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా.. ఈ వీడియోకు ఆసీస్ మాజీ పేస్ బౌలర్ బ్రెట్ లీ స్పందిస్తూ.. ‘అతడి ఫోన్ రింగ్ టోన్ తడిగా వస్తుంది..’ అని కామెంట్ చేశాడు.
ఇక రావల్పిండి టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో పాక్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 476 పరుగులు చేసింది. ఇందుకు ఆసీస్ కూడా ధీటుగానే బదులిచ్చింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. మరోసారి బ్యాటింగ్ లో రెచ్చిపోయింది. వికెట్లేమీ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ లలో పాక్ తరఫున సెంచరీలు చేసిన ఇమామ్ ఉల్ హక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 14న మొదలుకానుంది.
