ముంబై: వాంఖడే స్టేడియంలో మంగళవారం ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. సెంచరీ చేసి రికార్డును సృష్టిస్తాడని భావించిన కోహ్లీ 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. 

కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన విరాట్ కోహ్లీ ఆడమ్ జంపా వేసిన బంతిని స్ట్రైట్ డ్రైవ్ చేయబోయి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతకు ముందు బంతిని కోహ్లీ సిక్స్ గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని కూడా హిట్ చేద్దామని ప్రయత్నించి వికెట్ ను పారేసుకున్నాడు. 

కేఎల్ రాహుల్ అర్థ సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో అగర్ వేసిన బంతికి వికెట్ సమర్పించుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసాడు. రాహుల్, శిఖర్ ధావన్ 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత రాహుల్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ అర్థ సెంచరీ చేశాడు. ధావన్ 66 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ సెంచరీ చేశాడు. 

ధావన్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ గా పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో ఆరు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. కంగారుల ధాటికి ఆ తర్వాత భారత బ్యాట్స్ మెన్ ఎవరు కూడా పెద్దగా పరుగులు సాధించలేకపోయారు.