ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా అద్భుతంగా పోరాడింది. ఆసీస్ జట్టు విజయానికి అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని అనుకున్న దానిని డ్రాగా ముగించింది. 407 పరుగుల లక్ష్య చేధనలో ఐదో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 334 పరుగలతో నిలిచింది. పంత్, పుజారా, అశ్విన్ , విహారి పట్టుదలతో ఆడి జట్టు ఓడిపోకుండా కాపాడారు. సిరీస్ ని సమం చేశారు.

అయితే.. మ్యాచ్ లో పిక్క కండరాల గాయంతో పరుగులు తీయలేక విహారీ ఇబ్బంది పడటాన్ని అందరూ గమనించారు. కానీ.. అశ్విన్ అంతకన్నా ఎక్కువ నొప్పిని అనుభవించాడని ఆలస్యంగా తెలిసింది. ఆయన భార్య ప్రీతి చేసిన ట్వీట్ ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది. అంతకు ముందు రోజు విపరీతమైన నొప్పితో పడుకున్నాడని.. ఉదయం లేచి కనీసం నిటారుగా కూడా నిలపడలేకపోయాడని.. అలాంటిది ఆట అంత అద్భుతంగా ఎలా ఆడగలిగాడో తనకు అర్థం కాలేదని ఆమె ట్వీట్ చేయడం గమనార్హం.

 

గతరాత్రి అశ్విన్ తీవ్ర వెన్నునొప్పితో బాధపడ్డాడని, ఇవాళ ఉదయం నిటారుగా నిలబడలేకపోయాడని వివరించింది. కనీసం కిందకు వంగి షూ లేసులు కూడా కట్టుకోలేకపోయాడని, అలాంటివాడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను డ్రా దిశగా మళ్లించాడంటే నమ్మశక్యం కావడం లేదని తెలిపింది.

ప్రీతినే కాదు, భారత మాజీ క్రికెటర్లందరూ సిడ్నీ టెస్టు ఫలితంపై టీమిండియాను  కొనియాడుతున్నారు. ముఖ్యంగా, 256 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేసి భారత్ ను గట్టెక్కించిన విహారి, అశ్విన్ జోడీపై ప్రశంసల జడివాన కురుస్తోంది. వీరిద్దరూ స్టార్క్, కమ్మిన్స్, హేజెల్ వుడ్ విసిరిన బుల్లెట్ బంతులను ఎదుర్కొని మ్యాచ్ ను కాపాడుకున్న తీరు అమోఘం అని ప్రశంసలు కురిపిస్తున్నారు.